ASBL NSL Infratech

కేడర్‌ను చంద్రబాబు కంట్రోల్‌లో పెట్టగలరా..?

కేడర్‌ను చంద్రబాబు కంట్రోల్‌లో పెట్టగలరా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనే విధంగా తయారైంది. పార్టీల మధ్య, నేతల మధ్య వైరుధ్యాలున్నా అవి వ్యక్తిగత కక్షలకు దారితీసిన సందర్భాలు ఏపీలో చాలా తక్కువ. నేతలు హుందాగా ప్రవర్తించేవారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం టీడీపీపై అనుసరించిన వైఖరి చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇప్పుడు వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రతీకారంతో రగిలిపోతున్నారు నేతలు, కార్యకర్తలు. వీళ్లను కంట్రోల్ చేసే సత్తా చంద్రబాబుకు ఉందా.. అనే అనుమానం కలుగుతోంది.

2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలోనే జగన్ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. కక్షసాధింపులకు కూడా పాల్పడలేదు. ఎక్కడైనా వైసీపీ నేతలు గీత దాటితే వారిపై కేసులు నమోదయ్యాయి. కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపైన విచ్చలవిడిగా కేసులు నమోదయ్యాయి. కార్యకర్త మొదలు అధినేత చంద్రబాబు వరకూ ఎంతోమంది జైలుకు వెళ్లారు. వ్యక్తిగత దూషణలతో వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో వాళ్ల వేధింపులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.

అసెంబ్లీలో చంద్రబాబును కించపరుస్తూ నాటి మంత్రులు, వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు తీవ్ర ఆవేదన కలిగించాయి. ప్రతి ప్రెస్ మీట్ లో వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు లోలోపల కుమిలిపోయారు. వైసీపీ ఎప్పుడు ఓడిపోతుందా.. తమకు ఎప్పుడు ప్రతీకారం తీర్చుకునే సమయం వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. వైసీపీ నేతలకు బదులిచ్చే సమయం వచ్చిందని టీడీపీ నేతలు ఓపెన్ గానే చెప్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల నాడు రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి దారికి తెస్తున్నారు. సారీ చెప్పిస్తూ పోస్టులు పెడుతున్నారు.

వైసీపీ నేతలు నాడు తప్పు చేశారు కాబట్టే ఇప్పుడు దారుణంగా ఓడిపోయారు. అలాంటి వారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటూ ఉండడం, ఆల్రెడీ ఇప్పటికే ఆ పని స్టార్ట్ చేయడం పార్టీ హైకమాండ్ కు పెద్ద సమస్యగా మారింది. కేడర్ చేతులు కట్టేసి కామ్ గా కూర్చోబెట్టే పరిస్థితులు కనిపించట్లేదు. ఐదేళ్లపాటు మేము బాధలు పడ్డాం.. ఇప్పుడు మా చేతులు కట్టేస్తారా.. అని కేడరే ఎదురు తిరిగే పరిస్థితి నెలకొంది. అలాగని వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంటే అది ప్రభుత్వానికి మంచిది కాదు. ఇప్పుడు వైసీపీకి పట్టిన గతే రేపు టీడీపీకి పట్టొచ్చు. మరి దీన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తానేది ఆసక్తి కలిగిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :