ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎంల భేటీ..! బీఆర్ఎస్ నేతల ఏడుపులు.. పెడబొబ్బలు…!!

సీఎంల భేటీ..! బీఆర్ఎస్ నేతల ఏడుపులు.. పెడబొబ్బలు…!!

 

తెలంగాణలో ట్రయాంగులర్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రతిపక్షం కోసం బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తే ఆ హోదా తమదేననే ఆశతో ఉంది బీజేపీ. మరోవైపు తమను పదేళ్లపాటు ముప్పతిప్పలు పెట్టిన బీఆర్ఎస్ ను పీల్చి పిప్పి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో బీఆర్ఎస్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైన కూడా బీఆర్ఎస్ నేతలు,  కార్యకర్తలు నోరు పారేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మా చేతుల్లో ఏమీ లేదని.. రాష్ట్రాలే సర్దుకుపోవాలని సలహా ఇస్తోంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ దిశగా అడుగు ముందుకు వేయకపోగా సమస్యలను మరింత జటిలం చేసింది. అటు ఏపీలో మొదటి ఐదేళ్లు చంద్రబాబు అధికారంలో ఉండడంతో కేసీఆర్ చర్చల ఊసెత్తలేదు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. వాళ్లిద్దరి మధ్య మంచి సంబంధాలున్నా సమస్యల పరిష్కారానికి ఎవరూ చొరవ తీసుకోలేదు.

ఇప్పుడు ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ అధికారంలో ఉన్నారు. పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణతో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీనికి రేవంత్ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే దీన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఏపీ మొత్తాన్ని తెలంగాణకు రాసిచ్చేయాలన్నట్టు డిమాండ్లు వినిపిస్తోంది. గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చర్చలు బూటకమని.. వాళ్లిద్దరూ తమ సొంత ప్రయోజనాలకోసమే ఈ చర్చలు జరుపుతున్నారని ఆరోపిస్తోంది. గురుశిష్యులం కాదు.. సహచరులం.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని రేవంత్ చెప్పినా బీఆర్ఎస్ మాత్రం బురద జల్లేందుకే ప్రయత్నిస్తోంది.

పదేళ్లయినా సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఇప్పటికైనా వివాదాలకు చెక్ పెట్టుకోగలిగితే అభివృద్ధిపై రెండు రాష్ట్రాలు దృష్టి పెట్టే అవకాశం కలుగుతుంది. ఆ దిశగా రెండు రాష్ట్రాలూ ఒకడుగు ముందుకు వేశాయి. దీన్ని స్వాగతించాల్సింది పోయి తమకు నచ్చని నేతలు చర్చలు జరుపుతున్నారు కాబట్టి బురద జల్లాలనే తీరుగా వ్యవహరిస్తోంది బీఆర్ఎస్. వాస్తవానికి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరూ రాజీ పడే పరిస్థితి ఉండదు. అదే జరిగితే వాళ్ల వ్యక్తిగత రాజకీయ జీవితానికి వాళ్లంతట వాళ్లు చెక్ పెట్టుకున్నట్టే. అయితే వివాదానికి ముగింపు పలకాలంటే రెండు రాష్ట్రాలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్లక తప్పదు. దాన్ని కూడా సహించలేని బీఆర్ఎస్ లాంటి పార్టీలు వివాదాలను మరింత జటిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి తప్పితే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నట్టు కనిపించట్లేదు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :