అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య లంగర్‌హౌస్ చౌరస్తాలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మి అమ్మవారి తొట్టెలు, పలహారం బండికి పూజలు చేశారు. ఇక్కడే గోల్కొండ ఖిల్లా జగదాంబిక మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్లు సాక పెట్టి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పీకర్, మంత్రులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెబుతూ సాంస్కృతిక బృందాలు, పోతరాజులు నృత్యాలతో అమ్మవారి తొట్టెల ఊరేగింపు గోల్కొండకు బయలుదేరింది. భక్తులు అమ్మవారి తొట్టేలకు సాకలు పెట్టి, పూజలు చేశారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.