ASBL NSL Infratech

వైసీపీ ఎంపీలపై బీజేపీ కన్ను..! త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్..?

వైసీపీ ఎంపీలపై బీజేపీ కన్ను..! త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్..?

లోక్ సభ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో విజయం సాధించింది ఎన్డీయే కూటమి. సొంతంగానే 370 సీట్లు సాధించాలని, కూటమికి 400 సీట్లు రావాలని ఆకాంక్షించింది బీజేపీ. అయితే ఆ పార్టీ ఆశలు నెరవేరలేదు. ఎన్డీయే కూటమికి 292 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో కేంద్రంలో అధికారం దక్కినా అనుకున్నంత మెజారిటీ మాత్రం రాలేదు. దీంతో బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. త్వరలోనే మరింత పట్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. అందులో భాగంగా చిన్న పార్టీలపై బీజేపీ కన్నేసినట్లు ఢిల్లీ వర్గాల టాక్.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీకి 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కాయి. గెలిచిన నాలుగు పార్లమెంటు స్థానాల్లో మూడు రాయలసీమ నుంచే ఉన్నాయి. మరొకటి అరకు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. మొత్తంగా వైసీపీకి 15 పార్లమెంటు స్థానాలున్నాయి. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో వీళ్లలో చాలా మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తోంది. కేసుల నుంచి బయట పడేందుకు చాలా మంది పక్కచూపులు చూస్తున్నారని సమాచారం. సరిగ్గా దీన్నే వినియోగించుకోవాలనుకుంటోంది బీజేపీ.

వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, గుమ్మ తనూజారాణి ఉన్నారు. వీళ్లలో అవినాశ్ రెడ్డిపై కేసులున్నాయి. మిథున్ రెడ్డి ఫ్యామిలీపై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్లను చేర్చుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నలుగురినీ లేకుంటే కనీసం ముగ్గురిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఫిరాయింపుల చట్టం వర్తించజేయకుండా చూసుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. అలాగే రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మందిలో 8మందికి తక్కువ కాకుండా చేర్చుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్టు టాక్. విజయసాయి రెడ్డి ఇప్పటికే బీజేపీతో టచ్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయన నేతృత్వంలోనే వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

బీజేపీ మొట్టమొదటి ఆపరేషన్ వైసీపీ నుంచే ప్రారంభించబోతున్నట్టు ఢిల్లీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. వచ్చే ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం వైసీపీ అంతు చూసేంతవరకూ నిద్రపోదు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నింటినీ వెలికి తీయనుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడం ఒక్కటే మార్గం అని వైసీపీ ఎంపీలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సో.. వైసీపీని విలీనం చేసుకునే దిశగా బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి తెరలేవనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :