హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఐడీసీని సందర్శించిన బిల్ గేట్స్
హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ను ఏర్పాటు చేసిన పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఈ కేంద్రాన్ని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ సందర్శించారు. మైక్రోసాఫ్ట్ ఐడీసీని 1998లో ప్రతిపాదించారు. పాతికేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా బిల్ గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించడం, దానికి ఆయన స్పందించి మైక్రోసాఫ్ట్ ఐడీసీని ఏర్పాటు చేయడం తెలిసిందే. తదనంతరం ఈ కేంద్రం మైక్రోసాఫ్ట్ పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రపంచ స్థాయి ఉత్పత్తులైన అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపైలెట్, కొన్ని కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్ల అభివృద్ధిలో హైదరాబాద్ కేంద్రంలోని అత్యుత్తమ ఇంజనీర్లతో బిల్ గేట్స్ మాట్లాడారని, అది ఎంతో అద్భుత దృశ్యృమని మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్ వివరించారు. కృత్రిమ మేధ (ఏఐ) భారతదేశానికి అతిపెద్ద అవకాశమనే బిల్ గేట్స్ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఏఐ అధారిత క్లౌడ్, సెక్యూరిటీ, గేమింగ్ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం ఐడీసీ కృషి చేస్తోందని రాజీవ్ తెలిపారు.