ఆళ్లగడ్డ ఎవరి అడ్డా?

నంద్యాల జిల్లా భూమా వర్గానికి కంచుకోట. ఇక్కడి నుంచి భూమా కుటుంబం పోటీ చేసి ఉన్నత పదవులను అధిష్టించింది. శోభ ఆళ్లగడ్డ నుంచి భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేస్తూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల సమయంలో శోభ నాగిరెడ్డి ప్రమాదంలో మరణించడంతో.. వారసురాలిగా రంగ ప్రవేశం చేసిన అఖిలప్రియ.. ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తండ్రితో కలిసి టీడీపీలో చేరారు. అయితే భూమా నాగిరెడ్డి సహచరుడిగా మసలిన ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియ వర్గానికి పడడం లేదు. ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ టికెట్ ఆశిస్తున్నాడని.. అది జరగదని అఖిలవర్గీయులు చెబుతున్నారు.
ఈ రెండు వర్గాలు మాటల దాడులు కొనసాగుతూ వస్తున్నాయి. అదికాస్తా లోకేష్ సమక్షంలో స్ట్రీట్ ఫైట్ గా మారింది. ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మద్దతుదారులు రోడ్డుమీద అందులోను లోకేష్ సమక్షంలోనే ఒకళ్ళపై మరొకళ్ళు దాడి చేసుకున్నారు. ఇద్దరు ఒకళ్ళపై మరొకళ్ళు కేసులు పెట్టుకోవటం ఇపుడు కీలకమలుపు తిరిగింది. ఈపరిణామం టీడీపీ హైకమాండ్ కు మింగుడు పడడం లేదు.
వర్గ విబేధాలు కాస్త రోడ్డున పడడంతో.. టికెట్ ఇరువర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పుడు ఎవరికి పార్టీ హైకమాండ్ టికెట్ ఇస్తుందన్న అంశం ఆసక్తి కలిగిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డికి టికెట్ వచ్చే ప్రసక్తే లేదంటోంది అఖిలప్రియ. మొదటి నుంచి తమ కుటుంబమే ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది కాబట్టి, తమకే టికెట్ దక్కాలన్నది అఖిలప్రియ వాదన. అయితే భూమా దంపతులు మరణించిన తర్వాత వీరి బలం తగ్గిందని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు వాదిస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడం చాలా కష్టమైన పనిగా కనిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరి ఎమ్మెల్యే సీటు ఇచ్చినా, రెండోవారికి ఎలాంటి హామీలు ఉండనున్నాయి.ఆ హామీలతో రెండో వర్గం శాంతిస్తుందా? ఇప్పుడివన్నీ నంద్యాల జిల్లా తెలుగు తమ్ముళ్ల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
2019 ఎన్నికల తరువాత నుంచి వరుసగా అఖిల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఫిర్యాదులు..కేసులు..వివాదాలు వెంటాడుతున్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీలో అఖిలకు వచ్చే ఎన్నికల్లో సీటు గురించి చర్చకు కారణమవుతోంది.