మోదీ కేబినెట్ లోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్..! ఈటలకు కీలక బాధ్యతలు..!?
వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ నుంచి ఈసారి బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ కు ధీటుగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మోదీ కేబినెట్ లో ఎవరికి స్థానం దక్కుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టు మోదీ ప్రకటించారు. ఉదయం మోదీ ఇంట్లో జరిగిన తేనీటి విందుకు వీళ్లిద్దరూ హాజరయ్యారు. కీలక నేతలిద్దరూ కేబినెట్ లోకి వెళ్తుండడంతో తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడింది. మోదీ ఈసారి పాత మంత్రులను పక్కన పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని అందరూ ఆశించారు. అయితే అలా కాకుండా పాత కేబినెట్ లో ఉన్నవాళ్లలో మెజారిటీ మంత్రులకు ఈసారి కూడా కేబినెట్లో స్థానం దక్కింది. గత కేబినెట్లో మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈసారి కూడా ఛాన్స్ లభించింది. అదేవిధంగా తెలంగాణలో పార్టీని గట్టెక్కించిన బండి సంజయ్ ని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు మోదీ. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కగా.. బండి సంజయ్ కి సహాయమంత్రి హోదా దక్కింది.
వాస్తవానికి తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్ తదితరులు కేబినెట్లో చోటు ఆశించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీ బలోపేతానికి తనదైన స్థాయిలో పనిచేశారు. సౌమ్యుడిగా పేరొందారు. కేంద్ర పెద్దల దృష్టిలో మంచి పేరుంది. దీంతో ఆయనకు కచ్చితంగా కేబినెట్లో స్థానం దక్కుతుందనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన్ను పక్కన పెట్టారు. కానీ రాష్ట్ర బీజేపీ పగ్గాలను ఈటలకు అప్పగించేందుకే కేబినెట్లో చేటు ఇవ్వలేదని తెలుస్తోంది. త్వరలోనే కిషన్ రెడ్డి రాష్ట్ర పగ్గాలను వదులుకుంటారని.. ఆ స్థానాన్ని ఈటలకు కట్టబెడతారని టాక్ నడుస్తోంది.
మరోవైపు డీకే ఆరుణ కూడా మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. దాదాపు పదేళ్లుగా ఆమె పార్టీకోసం కష్టపడుతున్నారు. మహిళా కోటాలో ఆమెకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. అయితే ఆమెకు చోటు దక్కలేదు. అయితే కేంద్రంలో కీలక పార్టీ పదవిని ఆమెకు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పలువురికి కీలక పదవులు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలాగే పార్టీలో ముందునుంచి ఉన్నవారికి కూడా తగిన స్థాయిలో అవకాశాలు కల్పించడం ద్వారా బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.