జగన్‌తో బాలినేని భేటీ..! మళ్లీ యాక్టివ్ రోల్ పోషించబోతున్నారా..??

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని, ఇలాగే ఉంటే పార్టీ మారతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బాలినేని శ్రీనివాస రెడ్డి ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిసి జిల్లా రాజకీయ పరిణామాలపై తీవ్రంగా చర్చించారు. బాలినేనికి మళ్లీ కీలక పదవి అప్పగించేందుకు జగన్ సిద్ధమైనట్టు సమాచారం. అయితే అందుకు బాలినేని అంగీకరించారా.. లేకుంటే బెట్టు చేస్తారా.. అనే దానిపైనే సందిగ్ధత కొనసాగుతోంది.
ప్రకాశం జిల్లాలో కీలక నేత బాలినేని శ్రీనివాస రెడ్డి. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే ఆయనతో ప్రయాణం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే జగన్ కూడా బాలినేనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ లోనే మంత్రి పదవి అప్పగించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయేతే రెండో దఫా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేనిని తప్పించారు జగన్. దీనికి కూడా బాలినేని పెద్దగా ఫీల్ కాలేదు. అయితే జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ ను కంటిన్యూ చేయడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత జిల్లాపై మంత్రి ఆదిమూలపు సురేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఎక్కవైపోయింది. బాలినేని మాట నెగ్గే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బాలినేని అలకపూనారు. తాను పార్టీకి ఎంతో చేశానని, కానీ ఇప్పుడు పార్టీ మాత్రం తనకు అన్యాయం చేస్తోందని అనచరుల వద్ద వాపోయారు. అంతేకాక పార్టీ సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు.
పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేయగానే బాలినేనిని రెండు సార్లు పిలిపించి మాట్లాడారు జగన్. దీంతో పరిస్థితి సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. దీంతో ఇవాళ మరోసారి బాలినేని తాడేపల్లి పిలిపించారు జగన్. జిల్లాలో వైసీపీ పరిస్థితిపై బాలినేనితో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చీరాల, పర్చూరు, కొండేపి, అద్దంకి నియోజకవర్గాలపై చర్చ జరిగింది. ఈ చర్చల్లో ఐప్యాక్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలను బాలినేని ముందు ఉంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఐప్యాక్ ప్రతినిధులు బయటకు వెళ్లిపోయాక పార్టీలో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించాలని జగన్ బాలినినేని కోరారు.
ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సమన్వయ కర్త పదవిని మళ్లీ చేపట్టాలని బాలినేనికి జగన్ సూచించారు. అయితే బాలినేని మాత్రం అందుకు సుముఖత వ్యక్తే చేయలేదని సమాచారం. అయితే జగన్ మాత్రం కచ్చితంగా బాధ్యతలు చేపట్టాలని, తనకు దక్కాల్సిన ప్రాధాన్యంపై తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బాలినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియట్లేదు. ఒకవేళ జగన్ మాటలపై నమ్మకం కుదిరితే బాలినేని మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టి యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. అలా కాకపోతే బాలినేని స్థానంలో విజయసాయి రెడ్డికి ఆ పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదంతా బాలినేని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.






