రివ్యూ : బాలకృష్ణ న్యూ అవతార్ "భగవంత్ కేసరి" మస్తుగుంది!

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్,
రఘు బాబు, బ్రహ్మజీ, జాన్ విజయ్, శరత్ కుమార్, జయచిత్ర తదితరులు
సంగీతం: ఎస్ఎస్ థమన్, డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: 19.10.2023
నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు మాస్ ప్రేక్షకులకు పండగే పండగ. కొత్త కథలకు, కొత్త కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే బాలయ్య, ఈ సారి తన వయసుకు తగట్టుగా మునుపెన్నడూ చూడని విధంగా స్టైలీష్ గా, పవర్ ఫుల్‌గా వుండే డిఫరెంట్ లుక్ తో కనిపించారు నందమూరి బాలకృష్ణ. తండ్రీ కూతుర్ల బాండింగ్ తో బాలకృష్ణ అధ్యంతం తెలంగాణ మాండలికంలో బాలయ్య డైలాగ్స్ చెప్పించడం, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేస్తూ ప్రజెంట్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి సంచలన కాంబినేషన్ లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన "భగవంత్ కేసరి". ఎన్నో అంచనాలతో దసరా సందర్భంగా ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ:
నెలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) ఆదిలాబాద్ అడవి బిడ్డ, చేయని నేరానికి ఎవరో ఇరికించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ సమయంలో జైలర్ (శరత్ కుమార్) కూతురు విజయ లక్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీ లీల)తో చిన్నప్పటినుండి అనుబంధం ఏర్పడుతుంది. విజ్జి పాప ని ఆర్మీ లో చేర్చాలన్నది జైలర్ అనుకుంటాడు. కానీ... కారు ప్రమాదంలో జైలర్ మరణించడంతో భగవంత్ కేసరి తన సంరక్షణలో పెరిగే విజ్జి పాప ని ఆర్మీలో చేర్పించేందుకు శారీరకంగా, మానసికంగా ధృడంగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆర్మీలో చేరడం ఇష్టం లేకపోవడంతో చిచ్చా అని పిలచుకొనే విజ్జి పాప భగవంత్ కేసరి సలహాలను, సూచనలను విజ్జీ పట్టించుకోదు. కాలేజీలో తన క్లాస్‌మెట్‌తో ప్రేమలో పడిన విజ్జీ తన చిచ్చాకు దూరంగా ఉండాలని కోరుకొంటుంది.
ఇది అలా ఉండగా కేంద్రం నుండి రాష్ట్రాల వరకు వుండే రాజకీయ నాయకులను తన గుప్పెట్లో పెట్టుకుని వరల్డ్ నంబర్ వన్ బిజినెస్ మాన్ కావాలనుకునే రాహుల్ సింఘ్వీ (అర్జున్ రాంపాల్) చేసిన నేరాలు, అరాచకాలకు సంబందించిన రహస్య సాఫ్ట్ వేర్ విజ్జీ వద్ద ఉందనుకుని ఆమెను చంపేందుకు వెంటాడుతుంటాడు. విజ్జీ సంరక్షణ బాధ్యతలను భగవంత్ కేసరి ఎందుకు భుజాన ఎత్తుకొన్నాడు? విజ్జీకి ఉన్న మానసిక బలహీనతలు ఏమిటి? విజ్జీ మానసిక బలహీనతలకు కారణం ఏమిటి? భగవంత్ కేసరికి విజ్జీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత ఏం జరిగింది. రాహుల్ సింఘ్వికి భగవంత్ కేసరికి ఉన్న వైరం ఏమిటి? రాహుల్ సింఘ్వీ అరాచకాలకు భగవంత్ కేసరి ఎలా అడ్డుకట్టవేయాలని ప్రయత్నించాడు? భగవంత్ కేసరి, విజ్జీతో క్యాత్యాయిని (కాజల్ అగర్వాల్)కు ఉన్న రిలేషన్ ఏమిటి? చివరకు విజ్జీ ఆర్మీలో చేరిందా? రాహుల్ సింఘ్వీకి భగవంత్ కేసరి ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఇంతకు భగవంత్ కేసరి ఎవరు? భగవంత్ కేసరి ఎందుకు జైలుకు వెళ్లాడు? అనే ప్రశ్నలకు సమాధానమే భగవంత్ కేసరి సినిమా కథ.
నటీనటుల హావభావాలు:
భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. అతని నటనా, లుక్స్ అదుర్స్! బాల్యం నుండి హైదరాబాద్ నివాసం కాబట్టి తెలంగాణ యాస లో అయన చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. "నువ్వు యేడ వున్న గిట్ల దమ్ముతో నిలబడాలే అప్పుడే దునియా నీ బాంచన్ అంటది’’ “కలిసి మాట్లాడతా అన్నా కదా, అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే...” "కథలొద్దు జతలు తెగుతాయ్" “బ్రో... ఐ డోంట్ కేర్” అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసారు. తనకు బలం, బలహీనతగా మారిన రెగ్యూలర్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా అనిల్ రావిపూడి వేసిన రూట్‌లో అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. భగవంత్ కేసరిగా బాలయ్య నవ్విస్తాడు.. ఈలలు కొట్టిస్తాడు. కంటతడి పెట్టిస్తాడు. అంతేకాకుండా భావోద్వేగానికి గురిచేస్తాడు.
ఇక గ్లామర్ హీరోయిన్ శ్రీలీల ఓ రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమెది సోల్ కనెక్ట్ వున్న అందమైన పాత్ర విజ్జీ పాత్ర, అమాయకంగా, చిచ్చర పిడుగుల, చిచ్చా ఆశయం కోసం తనను తాను మార్చుకొనే ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. ఇప్పట వరకు డ్యాన్సర్‌గానే చూసిన ప్రేక్షకులకు తనలో మాస్, యాక్షన్ హీరోయిన్ కూడా ఉందనే విషయం ఈ సినిమా ద్వారా చెప్పింది. ఒక ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం వుండే పాత్ర తో ఆమె జాక్ పాట్ కొట్టేసింది. కాజల్ అగర్వాల్ రోల్ ఉనికి సినిమాలో ఉంటుంది. ఏదో బాలయ్య పక్కన జోడిగా కనిపిస్తుంది. శ్రీలీల ఇంపార్టెన్స్ మధ్య ఆమె ఎలివేట్ కాలేకపోయింది. అర్జున్ రాంపాల్ ఓ డిఫరెంట్ విలనిజంతో, బ్రహ్మజీ, జాన్ విజయ్, శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల మేర నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా కామెడీ, యాక్షన్ చిత్రాలతో ఇప్పటి వరకు నెట్టుకు రావడమే కాకుండా తన టాలెంట్‌తో విజయాలను అందుకొన్నారు. కానీ భగవంత్ కేసరితో ఆయన ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకుల ముందుకు రావడం రిస్కే అయినప్పటికీ.. మూవీని తీర్చి దిద్దిన విధానంతో దర్శకుడిగా గట్స్ కనిపిస్తాయి. కానీ ఒక మాస్ స్టార్ బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' గా ఆయన ఆడబిడ్డను సింహంలా తయారు చేయాలనే సంకల్ప కథతో, నేటి సమాజానికి అవసరమైన గుడ్ టచ్, బాడ్ టచ్ వంటి కీలక అంశాలను సృశిస్తు శక్తివంతమైన సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనుకోవడం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం రిస్కే అయినప్పటికీ.. మూవీని తీర్చి దిద్దిన విధానంతో దర్శకుడిగా గట్స్ కనిపిస్తాయి. బాలయ్య, శ్రీలీల కాంబినేషన్ డీల్ చేసిన విధానం హైలెట్. ఫ్యాన్స్ మనోభావాలను పక్కన పెట్టి.. హీరో హీరోయిన్ల పాటలు, మధ్యలో మషాలా సాంగ్స్, వంటి వాటికి వెళ్లకుండా స్వచ్చంగా కథను చెప్పే ప్రయత్నం చేయడం దర్శకుడిగా ఆయనలో మెచ్యురిటీ కనిపించింది.
ఇక మిగతా టెక్నీషయన్ విషయానికొస్తే... ఈ సినిమాకు అన్ని విభాగాలు సమతుల్యంతో మంచి అవుట్ పుట్ ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాంప్రసాద్ సినిమాటోగ్రఫి వర్క్ చాలా బాగుంది. ఫారెస్ట్, హైదరాబాద్‌లో సీన్లను అద్బుతంగా కెమెరాలో బంధించారు. సెక్రటేరియట్, అంబేద్కర్ ప్రాంతాలను చక్కగా చూపించారు. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. బీజీఎం విషయానికి వస్తే.. విక్రమ్, జైలర్ సినిమాలే గుర్తుకు వస్తాయి. పక్కా ఈ రెండు సినిమాల ట్రాక్స్‌ను అనుసరించాడా అనిపిస్తుంది. కానీ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారనే చెప్పాలి. ఎడిటింగ్‌కు ఇంకా కొంత స్కోప్ ఉంది. సాహు, హరీష్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా రిచ్‌గా, హై క్వాలిటీతో పండుగకు మంచి ఫుల్ మీల్స్ అందించారనే చెప్పాలి.
విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ నేలకొండ భగవంత్ కేసరి జైలు ఎపిసోడ్స్ సీన్‌తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా మొదలై.. బాలకృష్ణ పవర్ ఫుల్ ఎంట్రీతో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందనే సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ అసలు కథలోకి వెళ్లిన వెంటనే కథనంలో వేగం అందుకొంటుంది. సెకండాఫ్‌లో భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ స్టోరి రొటీన్, రెగ్యులర్‌గా మొదలు కావడంతో నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ ఒకసారి శ్రీలీల ట్రైనింగ్ మొదలైన తర్వాత మూవీ మరో జోన్‌లోకి వెళ్లినట్టు స్పష్టమవుతుంది. స్కూల్‌లో హై ఎమోషనల్ ఎపిసోడ్‌తో మూవీ ఊపందుకొన్నది. ఆ తర్వాత భగవంత్ కేసరి గురించి చెప్పే సీన్‌తో మూవీ ఫ్యామిలీ జోన్‌లోకి వెళ్లిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక క్లైమాక్స్‌లో శ్రీలీల, బాలయ్య యాక్షన్ మోడ్‌లో చెలరేగిపోవడం ఫ్యాన్స్‌కు ఫీస్ట్ మాదిరిగా అనిపిస్తుంది. మహిళా సాధికారత, హ్యుమన్ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ మేలవించిన చిత్రం భగవంత్ కేసరి. బాలకృష్ణ, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా చాలా అంశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. ఎలాంటి అంచనాలతో వెళ్లినా ఊహించని అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. దసరా పండుగకు భగవంత్ కేసరి మంచి ఎంటర్‌టైనర్‌తో ఎమోషనల్‌గా ఫ్యామిలీని ఆకట్టుకొనే చిత్రమని అనిపిస్తుంది.






