Radha Spaces ASBL

కాంగ్రెస్, బీజేపీ హైరానా... బిందాస్‌గా బీఆర్ఎస్..!!

కాంగ్రెస్, బీజేపీ హైరానా... బిందాస్‌గా బీఆర్ఎస్..!!

తెలంగాణలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. మరో ఆరు నెలలు మాత్రమే ఎన్నికలకు గడువుంది. దీంతో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కత్తులకు పదును పెట్టుకునే పనిలో బిజీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ ను గద్దె దించాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే బీజేపీని వీక్ చేసేందుకు కాంగ్రెస్, కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. దీంతో గట్టు మీద కూర్చున్న కేసీఆర్ ఓపికగా వాళ్ల పోరును చూస్తూ బిందాస్ గా ఉంటున్నారు.

కేసీఆర్ ను గద్దె దించాలనేది బీజేపీ, కాంగ్రెస్ పట్టుదల. అయితే ఈ రెండు పార్టీలకు అంతర్గత విభేదాలు పెద్ద సమస్యగా మారాయి. పైగా బీఆర్ఎస్ తో పోల్చితే ఈ రెండు పార్టీలు చాలా వీక్ గా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం బలోపతంపై దృష్టి పెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇటీవల బీజేపీలో చేరారు. బీజేపీ కూడా బాగా హడావుడి చేయడంతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఆ పార్టీయే అని అందరూ నమ్మారు. దీంతో నేతలంతా కమలం పార్టీ కండువా కప్పుకునేందుకు పోటీ పడ్డారు. ఇప్పుడు కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ సీన్ రివర్స్ అయింది. ఆ పార్టీ సత్తా ఏంటో అర్థమైపోయింది. అంతేకాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 10 శాతం మేర పుంజుకుందనే సర్వేలు బీజేపీకి పెద్ద సమస్యగా మారాయి. దీంతో ఉన్న నేతలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది తెలంగాణ బీజేపీ.

ఇక కాంగ్రెస్ పార్టీలో కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు దాదాపు సిద్ధమైన పొంగులేటి, జూపల్లి లాంటి నేతలు కూడా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు రెడీ అయ్యారు. వీళ్లేకాక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పలువురు కీలక నేతలు కూడా మళ్లీ సొంతగూటికి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కున్న పెద్ద సమస్య అంతర్గత విభేదాలు. నేతల మధ్య అస్సలు పడట్లేదు. దీంతో ప్రతి సమస్యను హైకమాండ్ దగ్గరుండి సర్దిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కాంగ్రెస్ పార్టీపైన భారీ ప్రభావం చూపనుంది. నేతల మధ్య ఐక్యమత్యం లేకపోవడం, పైగా కొందరు నేతలు కోవర్టులుగా పని చేస్తుండడం కూడా హస్తం పార్టీకి పెద్ద సమస్యగా మారింది.

అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వాటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ బిందాస్ గా ఉంది. అధికారంలో ఉండడంతో చివర్లో చక్కబెట్టాల్సిన పనులపై దృష్టిపెట్టారు సీఎం కేసీఆర్. మిగిలిన పెండింగ్ పనులను, అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే మరిన్ని వరాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ రెండు పార్టీలు కొట్టుకుంటూ ఉంటే గట్టున కూర్చున్న కేసీఆర్ తమాషా చూస్తూ తన పని తాను చేసుకుపోతున్నారు. ఈసారి కూడా గెలుపు తమదేనని, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమా బీఆర్ఎస్ లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :