ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణ బీజేపీలో మళ్లీ లొల్లి..! హైకమాండ్‌కు కొత్త తలనొప్పి..!!

తెలంగాణ బీజేపీలో మళ్లీ లొల్లి..! హైకమాండ్‌కు కొత్త తలనొప్పి..!!

తెలంగాణలో అధికారంలో రావాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. గత కొంతకాలంగా ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రాగా.. లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో పార్టీ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 2028లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. అయితే సంస్థాగతంగా పార్టీలో అనేక ఇబ్బందులు బీజేపీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నేతల మధ్య మనస్ఫర్థలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణలో బీజేపీకి మంచి కార్యకర్తలున్నారు. ఇటీవల నేతలు కూడా పెద్దఎత్తున బీజేపీలో చేరారు. గతంతో పోల్చితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ ఏర్పడింది. అధికార కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కు ధీటుగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజాదరణ పొందుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో కాంగ్రెస్ తర్వాత బీజేపీయే పెద్ద పార్టీగా అవతరించింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ హైకమాండ్ సంతృప్తిగానే ఉంది. అయితే 10కి పైగా స్ధానాలు ఆశిస్తే 8కే పరిమితం కావడం కాస్త అసంతృప్తికి కారణమైంది. అయినా బీఆర్ఎస్ ను ఖాళీ చేయడంతో బీజేపీ హ్యాపీగానే ఉంది.

తెలంగాణలో బీజేపీకి సీట్లు, ఓట్లు గణనీయంగా పెరుగుతుండడంతో హైకమాండ్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే రావడంతో ఆయన కేబినెట్లో ఇద్దరికి స్థానం కల్పించింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రివర్గంలో చోటు లభించింది. వీళ్లిద్దరూ పార్టీకి ముందు నుంచి లాయల్ గా ఉన్నారు. వాళ్లను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా వారికి సముచిత స్థానం కల్పించినట్లయింది. అయితే వాళ్లిద్దరూ కేంద్ర కేబినెట్లోకి వెళ్లడంతో రాష్ట్రంలో పార్టీని నడిపించే వాళ్లు లేకుండా పోయారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి వీలైనంత త్వరగా తనను తప్పించి వేరొకరికి బాధ్యతలివ్వాలని కోరుతున్నారు.

కిషన్ రెడ్డి స్థానంలో ఈటల రాజేందర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి మల్కాజిగిరిలో గెలిచిన తర్వాత ఈటలకు కేంద్ర కేబినెట్లో స్థానం దక్కుతుందనుకున్నారు. అయితే అధ్యక్ష బాధ్యతలివ్వాలనే ఉద్దేశంతో ఈటలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈటలకు పార్టీ పగ్గాలివ్వొద్దని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు, బీజేపీ సిద్ధాంతలకు కట్టుబడి ఉన్న వాళ్లకే అధ్యక్ష పగ్గాలనివ్వాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఈ కోవలోకే వస్తాయి. అయితే ఈటల రాజేందర్ కూడా ఈ కామెంట్స్ ను తిప్పికొట్టారు. ఫైట్ చేసే వాడికే పగ్గాలనివ్వాలని స్పష్టం చేశారు.

గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ వర్గీయులు ఆయనపై ఫిర్యాదులు చేసి అధ్యక్షపదవి పోవడానికి కారణమయ్యాయరని పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. ఆ సమయంలో బండి సంజయ్ స్థానంలో ఈటలకు పార్టీ పగ్గాలిస్తారని అందరూ అనుకున్నారు. కానీ కిషన్ రెడ్డికి ఇవ్వడం ద్వారా అసంతృప్తులకు చెక్ పెట్టింది అధిష్టానం. ఇప్పుడు మళ్లీ ఈటల రాజేందర్ పేరు తెరపైకి రాగానే ఓ వర్గం అసంతృప్తి గళం వినిపించడం మొదలు పెట్టింది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు.. పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. వీళ్లలో ఎవరికి ఇస్తారు.. ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :