ASBL NSL Infratech

బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా..? నష్టమా..?

బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా..? నష్టమా..?

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల ఎత్తులు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ తమది ఒంటరిపోరేనని ఇప్పటికే తేల్చేసింది. పొత్తులకు మొదటి నుంచి ఆ పార్టీ వ్యతిరేకం. చావోరేవో ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నాయి. తాజాగా బీజేపీ కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమైందని సమాచారం. ఈ వ్యవహారంపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. రేపు బీజేపీ ముఖ్యులతో పొత్తులపై చర్చలు జరపనున్నారు. అయితే బీజేపీతో పొత్తు తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందా.. లేదా.. అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

తెలుగుదేశం – బీజేపీ పొత్తు కొత్త కాదు. 2014లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేశాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నాయి. అయితే 2019కి ఏడాది ముందు ఆ రెండు పార్టీలూ విడాకులు ఇచ్చుకున్నాయి. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు గళమెత్తారు. హోదాను వదిలేసుకుని ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు చివర్లో మళ్లీ యూటర్న్ తీసుకుని హోదాకోసం పోరుబాట పట్టారు. అప్పటివరకూ కలిసున్న జనసేన కూడా హ్యాండిచ్చి వెళ్లిపోయింది. దీంతో ఈ ముగ్గురూ ఎవరికి వారుగా బరిలోకి దిగారు. టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

2019లో ఓటమి చంద్రబాబుకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం, అది కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా మెలగడం చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో కేసులు చుట్టుముట్టాయి. దీంతో కేంద్రంలోని బీజేపీతో సఖ్యతకోసం చంద్రబాబు చాలా ట్రై చేశారు కానీ బీజేపీ పెద్దలు ఆయన్ను దగ్గరకు రానివ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ ప్లాన్ వేసింది. అయితే బీజేపీతో వెళ్తే లాభం లేదనుకున్న జనసేన.. టీడీపీతో వెళ్లడానికి డిసైడ్ అయింది. దీంతో బీజేపీ ఒంటరైపోయింది. ఒంటరిగా వెళ్తే ఒక్కసీటు కూడా రాదని ఆ పార్టీకి తెలుసు. కేడర్ కూడా కూటమితో కలిసి వెళ్లాలని కోరుకుంటోంది. దీంతో టీడీపీతో పొత్తు ఇష్టం లేకపోయినా పార్టీకోసం, కేడర్ కోసం కలిసి వెళ్లేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే బీజేపీతో కలిసి వెళ్లడం చంద్రబాబుకు ఇబ్బందే అని చెప్పొచ్చు. గతంలో బీజేపీపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ వెళ్లి ఆ పార్టీతో అంటకాగడం జనాల్లో పలుచన చేయడం ఖాయం. అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తారనే అపవాదు ఇప్పటికే చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు బీజేపీతో మళ్లీ పొత్తు ఖరారైతే ఆ పేరు మరింత సార్థకం అయినట్టే. మరోవైపు జనసేనతో పొత్తు వల్ల ఇప్పటికే కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. బీజేపీకూడా జత కడితే మరిన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి వెళ్లడం టీడీపీ, జనసేనకు కాస్త కలిసొచ్చే అంశం. అందుకే ఆ రెండు పార్టీలూ బీజేపీతో వెళ్లేందుకు ఉబలాటపడుతున్నాయి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :