ASBL Koncept Ambience
facebook whatsapp X

వై.ఎస్.వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

వై.ఎస్.వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ త్వరలో ఓ కొలిక్కి రానుందా..? విచారణను వేగవంతం చేసి త్వరగా ఈ కేసును ముంగించబోతోందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. దీన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ వెంట పడుతోంది. ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. దీంతో త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు.

వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంచలనం. మొదట్లో దీన్ని గుండెపోటు అని, తర్వాత ఆత్మహత్య అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు ఇది హత్య అని తేల్చారు. అయితే ఎవరు చేశారనేదానిపై స్పష్టత లేదు. వివేకానంద రెడ్డి కుమార్తె రంగంలోకి దిగి కుటుంబసభ్యులపైనే ఆరోపణలు చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. సునీత ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగి అనుమానితులందరినీ విచారించింది. చివరకు వైసీపీ ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి దగ్గరికొచ్చి ఆగిందీ కేసు. ఇప్పుడు అవినాశ్ రెడ్డి కుటుంబం చుట్టూనే ఈ కథ నడుస్తోంది.

గత నాలుగు వారాలుగా అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అడపాదడపా విచారణకు పిలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణాధికారి రామ్ సింగ్ దీన్ని త్వరగా ముగించట్లేదని.. ఆయన్ను మార్చాలని కేసులో నిందితుడిగా ఉన్నా శివశంకర్ రెడ్డి భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణలో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దర్యాప్తు అధికారి రామ్ సింగ్ సక్రమంగానే పని చేస్తున్నారని సీబీఐ బదులిచ్చింది. దీని తాజా పరిస్థితిపై సీబీఐ డైరెక్టర్ ను అడిగి సోమవారం లోపు నివేదించాలని సీబీఐ తరపు న్యాయవాదిని ఆదేశించింది సుప్రీంకోర్టు.

వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు, సీబీఐ, సాక్ష్యుల మధ్య ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. సాక్ష్యులు, నిందితులు వివిధ అంశాలపై కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు దస్తగిరి, మరో వైపు శివశంకర్ రెడ్డి భార్య, మరోవైపు అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి.. ఇంకోవైపు వివేకా కుమార్తె సునీత.. ఇలా ఎవరికి వాళ్లు వాళ్ల యాంగిల్లో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో కేసు విచారణ కంటే కోర్టులకు సమాధానం చెప్పేందుకే సీబీఐకి టైమ్ సరిపోవట్లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని త్వరగా తేల్చాలని ఆదేశించడంతో బహుశా త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం..

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :