ASBL NSL Infratech

నోరు జారిన రాపాక..! ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?

నోరు జారిన రాపాక..! ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే కోటా ఎన్నికల సందర్భంగా తనకు తెలుగుదేశం పార్టీ నేతలు పది కోట్లు ఆఫర్ చేశారని రాపాక చెప్పారు. అయితే తాను ఆఫర్ ను తిరస్కరించానన్నారు. ఇంతలోనే తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

నోరు జారితే వెనక్కు తీసుకోలేం. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే జీవితకాలమంతా అవి వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి కూడా ఇదే. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. తాను దొంగ ఓట్లతోనే గెలిచానన్నారు. తన సొంతూరు చింతలమోరులో తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారని చెప్పారు. అక్కడ ఓట్లుంటాయని.. కానీ ఎవరో ఎవరికీ తెలియదని చెప్పారు రాపాక. అంతటితో ఆగకండా గతంలో వచ్చిన 800 ఓట్ల మెజారిటీ కూడా అలాగే వచ్చిందన్నారు.

ఎమ్మెల్యేగా ఉన్న రాపాక స్వయంగా తాను దొంగ ఓట్లతోనే గెలిచానని చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షమే కాదు.. సొంతపార్టీ జనసేన కూడా రాపాకపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. స్వయంగా ఓ ఎమ్మెల్యేనే తాను దొంగ ఓట్లతో నెగ్గానని ప్రకటించడం కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.

ఇక ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ఏపీలో ఏ స్థాయిలో దుమారం రేపుతున్నాయో తెలిసిన విషయమే. తమ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు రాపాక వర ప్రసాద్ కూడా వైసీపీ అనుబంధ సభ్యుడిగానే ఉన్నారు. తనను కూడా టీడీపీ నేతలు కొనేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనకు పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని.. అయితే తాను నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నా కాబట్టి ఆఫర్ తిరస్కరించానని రాపాక వెల్లడించారు. ఈ కామెంట్స్ పై టీడీపీ మండిపడింది. రాపాకక పది వేలు కూడా ఎక్కువేనని ఎద్దేవా చేస్తోంది. జగన్ ప్రాపకం పొందేందుకు రాపాక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని విమర్శించింది. మొత్తానికి రాపాక ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద రచ్చ రాజేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :