MKOne Telugu Times Youtube Channel

వేటుకు కారణమైన చోటు నుంచే రాహుల్ గాంధీ సమరశంఖం!

వేటుకు కారణమైన చోటు నుంచే రాహుల్ గాంధీ సమరశంఖం!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు ఒకటి, రెండు రౌండ్లు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా చేసేశారు. అయితే ఇప్పుడు షెడ్యూల్ విడుదలవడం, 40 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ప్లాన్ వేశారు.

కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ప్రధాన పార్టీలు. మూడు అధికారాన్ని అనుభవించినవే. అందుకే ఈసారి అధికారం తమకే దక్కాలనే పట్టుదల అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి నుంచి అధికారాన్ని లాక్కుంది బీజేపీ. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలగా ఉన్నాయి. ఎలాగైనా బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ పార్టీ బాధ్యతలను డి.కె.శివకుమార్ మోస్తున్నారు. ఆయనపై బీజేపీ ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఆయన వెనక్కు తగ్గకుండా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రీపోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్తుండడంతో అవకాశాన్ని వదులుకోకూడదని కాంగ్రెస్ లీడర్లు పట్టుదలగా ఉన్నారు. గెలుపుకోసం అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ఈ ఎన్నికల్లో బాగా వాడుకోవాలని కర్నాటక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

రాహుల్ గాంధీని వాడుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీపై అనర్హత వేటు పడింది. ఇందుకు కారణం గతంలో కర్నాటకలోని కోలార్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్సే. అయితే రాహుల్ పై కేంద్రం కక్ష సాధిస్తోందనే ప్రచారం బలంగా వెళ్లడం, రాహుల్ పై సానుభూతి వెల్లువెత్తుతుండడంతో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే రాహుల్ గాంధీతో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. అది కూడా తన అనర్హత వేటుకు కారణమైన కోలార్ నుంచే.! వచ్చే నెల 5న రాహుల్ గాంధీ కోలార్ లో ఎన్నికల శంఖారావం పూరిస్తారని సమాచారం. రాహుల్ గాంధీ అడుగు పెడితే సీన్ మారిపోతుందని కర్నాటక కాంగ్రెస్ ధీమాగా ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో!

 

 

 

Tags :