పేర్ని నాని బాటలో మరికొందరు సీనియర్లు..! షాక్‌లో జగన్..!?

జగన్ అంటే పేర్ని నానికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి వై.ఎస్. హయాంలో ఆయన వెన్నంటి నడిచిన పేర్ని నాని ఆ తర్వాత జగన్ కు మొదటి నుంచి అండగా ఉన్నారు. పార్టీ ఓడినా గెలిచినా జగన్ ను మాత్రం విడిచి పెట్టలేదు. అందుకు కృతజ్ఞతగానే పేర్ని నానికి మొదటి కేబినెట్ లోనే స్థానం కల్పించారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు పేర్ని నాని. అయినా ఆయన ఏనాడూ నోరు జారలేదు. పార్టీ మాట కాదనలేదు. పార్టీకి తగ్గట్టు, జగన్ చెప్పినట్టు నడుచుకుంటూ పోయారు. అయితే తాజాగా పేర్ని నాని చేసిన కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా రాజకీయ విరమణ లాంటివి చేసేటప్పుడు పార్టీ అధినేతతో ముందే సంప్రదిస్తారు. వాళ్లకు ఒక మాట చెప్పి నిర్ణయం తీసుకుంటారు. కానీ పేర్ని నాని అలా చేయలేదు. జగన్ సమక్షంలో.. ఆయన ముందే అకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో జగన్ సహా అక్కడున్న వాళ్లంతా షాక్ కు గురయ్యారు. ఇదేంటి ఇలాంటి విషయాలను ఇలా ఓపెన్ గా ప్రకటించేశారు.. అని ఆయన సన్నిహితులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే పేర్ని నాని ప్రకటన వెనుక వేరే కారణాలున్నాయిని తెలుస్తోంది. అందుకే అనూహ్యంగా అందరి ముందూ ప్రకటించాలని డిసైడై ఆ పని చేసినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి పేర్ని నానికి రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన లేదు. అయితే తన కుమారుడికి మాత్రం ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోవాలనే ఆశ ఉంది. ఈ విషయాన్ని ఇదివరకే జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారసుడికి టికెట్ పై జగన్ నుంచి హామీ రాలేదు. ఒకవేళ కుమారుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే కుమారుడికే జగన్ హామీ ఇవ్వలేదు. అలాంటప్పుడు తనకు ఎంపీ సీటు ఇస్తారనే నమ్మకం లేదు. అందుకే తాను తప్పుకుంటే కనీసం కుమారుడికి టికెట్ గ్యారంటీ అని నమ్మారు. అందుకే జగన్ తో ఈ విషయాలేవీ చర్చించకుండానే బహిరంగంగానే తన నియోజకవర్గ ప్రజలందరి ముందూ రాజకీయ విరమణపై ప్రకటన చేశారు.
పేర్ని నాని ప్రకటన జగన్ కు ఆశ్చర్యం కలిగించింది. నాని బాటలో మరికొంతమంది పయనించే అవకాశం ఉందని ఇప్పుడు జగన్ టెన్షన్ పడుతున్నారు. అసలే పార్టీ పరిస్థితి బాగాలేదని సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్లను కాదని వారసులకు టికెట్లు ఇవ్వడం పెద్ద సాహసమే అవుతుంది. అందుకే సీనియర్లతోనే ఈసారి పోటీ చేయాలనుకుంటునన్నారు జగన్. కానీ వారసులను దింపి వాళ్లకు ప్లాట్ ఫాం రెడీ చేసుకోవాలనుకుంటున్నారు సీనియర్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది.