Radha Spaces ASBL

పవన్ కల్యాణ్‌ను వైసీపీ గెలికి మరీ రెచ్చగొడుతోందా..?

పవన్ కల్యాణ్‌ను వైసీపీ గెలికి మరీ రెచ్చగొడుతోందా..?

పవన్ కల్యాణ్ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. తాను ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసుకున్న వారాహి వాహనాన్ని పరిచయం చేశారు. అప్పటి నుంచి రచ్చ మొదలైంది. ఆ వాహనానికి ఆ రంగు వాడకూడదని.. రక్షణ రంగ చట్టాలకు అది విరుద్ధమని వైసీపీ వాళ్లు పోస్టులు పెడ్తున్నారు. దీంతో జనసేన నేతలు కూడా నోటికి పని చెప్తున్నారు. వైసీపీపై కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో జనసేన - వైసీపీ మధ్య మరోసారి వార్ మొదలైంది. సాధారణంగా పవన్ కల్యాణ్ రోజువారీ రాజకీయం చేయరు. చాలా మంది విమర్శించినట్లు ఆయన పార్ట్ టైం మాత్రమే పాలిటిక్స్ చేస్తుంటారు. ప్రతిరోజూ పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని ప్రెస్ నోట్లు మాత్రం విడుదలవుతుంటాయి. పవన్ కల్యాణ్ మాత్రం రోజూ జనాల్లో కనిపించరు. దీంతో ఆయనకు పార్ట్ టైమ్ పొలిటీషన్ అనే విమర్శ పదే పదే వినిపిస్తూ ఉంటుంది.

కానీ ఆయన మాత్రం రోజూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నిలుస్తూ ఉంటారు అనడం కంటే ఆయన్ను వార్తల్లో నిలిచేరా చేస్తుంటారు అనడం కరెక్ట్. ముఖ్యంగా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ ను రోజూ యాక్టివ్ గా ఉంచుతుంటారు. సాధారణంగా పవన్ కల్యాణ్ తన పనేదో తాను చేసుకుంటూ పోతుంటారు. కానీ వైసీపీ వాళ్లు ఏదో ఒక రూపంలో ఆయన్ను కెలుకుతుంటారు. దీంతో జనసేన నేతలు, పవన్ కల్యాణ్ రివర్స్ అటాక్ మొదలు పెడుతుంటారు.

ఇప్పడు కూడా అదే జరుగుతోంది. వారాహి వాహనాన్ని పవన్ కల్యాణ్ ట్వీట్ చేయగానే వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా విభాగం ఆ వాహనం రంగుపై విమర్శలు గుప్పించాయి. ఆ ఆలివ్ గ్రీన్ రంగును రక్షణ రంగ వాహనాలకు తప్పా మరెవరూ వాడడానికి వీల్లేదని పోస్టులు పెట్టాయి. పవన్ మోటార్ వెహికల్ యాక్ట్ చదవలేదా.. అని పేర్ని నాని ప్రశ్నించారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ పై రక్షణవర్గాలు కేసు నమోదు చేయబోతున్నాయని ప్రచారం చేశాయి. దీంతో జనసేన శ్రేణుల నుంచి కూడా రివర్స్ కౌంటర్స్ మొదలయ్యాయి. తాను ఏం చేయాలో కూడా.. ఏం వేసుకోవాలో కూడా వైసీపీ వాళ్లే డిసైడ్ చేస్తారా.. అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విశాఖలో, మంగళగిరిలో తనను బయటకు రాకుండా అన్ని ఆయుధాలూ ప్రయోగించారని.. కనీసం శ్వాస తీసుకునే అవకాశమైనా నాకు ఉందా.. లేదా.. అని సూటిగా ప్రశ్నించారు. దీనికి వైసీప నుంచి మళ్లీ ఎటాక్ మొదలైంది.. శ్వాస తీసుకో.. ప్యాకేజీ వద్దు.. అంటూ అంబటి సెటైర్స్ విసిరారు.

ఇంతటితో వైసీపీ - జనసేన మధ్య ఎటాక్స్ ఆగలేదు. కనీసం ఈ చొక్కా అయినా వేసుకోవచ్చా.. అంటూ ఆలివ్ గ్రీన్ కలర్ చొక్కా ఒకటి పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. అంతేకాదు.. గ్రీనరీ ఫోటో ఒక దాన్ని పెట్టి.. ఇందులో ఏ గ్రీన్ వేరియంట్ ను వాడుకోవాలి వైసీపీ.. అని ప్రశ్నించారు. రూల్స్ ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమేనా అని ఆలివ్ కలర్స్ లో ఉన్న పలు రకాల వాహనాలను ట్వీట్ చేశారు. అంతేకాక ఐ లైక్ దిస్ యాడ్ అని ఒకటి పోస్ట్ చేసి దాన్ని వైసీపీకి ఆపాదించారు. పిల్లలు పక్కనున్న వాళ్లను చూసి జెలస్ ఫీలవుతున్నప్పుడు ఈ కోట్ తనకు క్లాస్ టీచర్ చెప్పేవారంటూ మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా జలసీతో రోజురోజుకూ నలిగిపోతోందని మరో ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. వాస్తవానికి ఇది చాలా సిల్లీ ఇష్యూ.

పవన్ కల్యాణ్ వాహనంపై ఏవైనా అభ్యంతరాలుంటే దానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ చేయరు. అది అక్కడితో ఆగిపోతుంది. ఇందులో వైసీపీ వాళ్లు దూరి ఈ స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదేమో. కానీ ఇక్కడ అదే జరిగింది. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారనేది సామెత. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ట్వీట్స్ చేయడం మొదలు పెట్టడంతో ఆయన్ను మరోసారి వైసీపీయే వార్తల్లోకి తెచ్చినట్లయింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :