ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నెల్లూరు వైసీపీలో రచ్చ.. కోటంరెడ్డి గుడ్ బై?

నెల్లూరు వైసీపీలో రచ్చ.. కోటంరెడ్డి గుడ్ బై?

నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో అంతర్గత విభేదాలు వీధిన పడ్డాయని చెప్పొచ్చు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం పార్టీ అధిష్టానానికి అస్సలు మింగుడు పడడం లేదు. దీంతో వారికి పొమ్మనలేక పొగపెడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉంటూ వచ్చారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అయినా ఇప్పుడు కోటంరెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో ఆయన బయటకు రావడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వెంటే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా వెన్నంటి నడిచారు. నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి వై.ఎస్. ఫ్యామిలీతో ఉన్న వాళ్లలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుంటారు. వైసీపీ అధికారంలోకి వస్తే కోటంరెడ్డి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ఆ ఛాన్స్ దక్కలేదు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో అయినా కేబినెట్ బెర్త్ ఖాయం అని భావించారు. అయితే రెండోసారి కూడా మొండిచెయ్యే ఎదురైంది. దీంతో కోటంరెడ్డి భావేద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుటే కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో కోటంరెడ్డిని పిలిపించుకుని జగన్ మాట్లాడడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.

అయితే జిల్లాలో సీనియర్ నేతగా, జగన్ కు సన్నిహితుడిగా ఉన్నా కూడా తనకు పలుకుబడి లేకుండా పోయింది. అధికారులందరూ జిల్లా మంత్రుల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చారు. నియోజకవర్గ సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నాననే ఆవేదన కోటంరెడ్డిలో కనిపించేది. డ్రైనేజీ కాలువ మరమ్మత్తు కోసం ఆయన అందులో దిగి నిరసన తెలియజేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా అడపాదడపా కోటంరెడ్డి తన అసంతృప్తిని బయటపెడుతూ వచ్చారు.  తాజాగా తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని బహిరంగంగానే వెల్లడించారు. మూడు నెలల నుంచి ట్యాపింగ్ చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని.. అధికార పార్టీలో ఉన్న తనపై నిఘా పెట్టడమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానం ఉన్నచోట ఉండలేమని స్పష్టం చేశారు.

దీంతో కోటంరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తనను తప్పించి తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని నియమించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందన్నారు కోటంరెడ్డి. ఇలా తన కుటుంబంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తన తమ్ముడిని వైసీపీ బరిలోకి దింపితే తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు కోటంరెడ్డి. అదే పరిస్థితి వస్తే తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తానని తెల్చేశారు.

అయితే కోటంరెడ్డి ఫ్యామిలీని వైసీపీ విడగొడుతుందా అనేది ఆసక్తిగా మారింది. కోటంరెడ్డి సోదరుడు వైసీపీలో కంటిన్యూ అవుతారా.. లేకుంటే సోదరుడి వెంట నడుస్తారా.. అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోదరుడి వెంట నడిస్తే ఆనం విజయ్ కుమార్ రెడ్డిని సమన్వయ కర్తగా నియమించేందుకు వైసీపీ హైకమాండ్ సిద్ధమవుతోంది. మొత్తానికి కోటంరెడ్డి పార్టీ వీడడం ఖాయమని వైసీపీ నిర్ణయానికొచ్చింది. కోటంరెడ్డి కూడా ఈ విషయంపై క్లారిటీతో ఉన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :