Radha Spaces ASBL

కేశినేని నాని హాట్ కామెంట్స్..! టీడీపీకి షాక్ ఇవ్వబోతున్నారా..?

కేశినేని నాని హాట్ కామెంట్స్..! టీడీపీకి షాక్ ఇవ్వబోతున్నారా..?

కృష్ణా జిల్లా టీడీపీలో కేశినేని నాని కీలక నేత. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మూడు ఎంపీ స్థానాల్లో కేశినేని నాని కూడా ఉన్నారు. వైసీపీ వేవ్ ను సైతం తట్టుకుని గెలిచిన నాయకుడాయన. స్థానికంగా మంచి పట్టుంది. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తన ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేశినేని ట్రావెల్స్ ను కూడా రద్దు చేసుకున్నారు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అయితే ఇటీవలికాలంలో టీడీపీలో ఆయనకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేశినేని నాని ఉన్నారు. టీడీపీ తరపున గెలిచిన ఆయన నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు. కృష్ణా జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ లాంటి వాళ్లతో కేశినేని నానికి విభేదాలున్నాయి. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. వాళ్ల కార్యక్రమాల్లో ఈయన పాల్గొనరు. ఈయన కార్యక్రమాలకు వాళ్లు రారు. అయితే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా కేశినేని నాని హాజరవుతుంటారు. తన పరిధిలో సాయం చేస్తుంటారు.

తాజాగా నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి కేశినేని నాని హాజరయ్యారు అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పనితీరును కేశినేని నాని మెచ్చుకున్నారు. అలాగే కేశినేని నానిపైన మొండితోక జగన్మోహన్ రావు కూడా ప్రశంసలు కురిపించారు. ఇది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. నానిని విజయవాడ స్థానిక నేతలు చాలాకాలంగా దూరం పెట్టారు. టీడీపీ కార్యాలయంగా ఉన్న కేశినేని భవన్ కు రావడం కూడా మానేశారు. సోదరుడు కేశినేని చిన్ని .. బుద్ధా వెంకన్నతో కలిసి ఫుల్ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనేది ఆయన కోరిక.

ఇలాంటి పరిస్థితుల్లో మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి కేశినేని నాని పాల్గొనడం, పరస్పరం పొగుడుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీనిపై నాని వివరణ ఇచ్చారు. తనకు వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు నాలుగేళ్లుగా తెలుసని, తన పార్లమెంటు పరిధిలో ఉన్నందున ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటామని నాని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముళ్లపందినైనా ముద్దాడతానని నాని స్పష్టం చేశారు.  వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాకపోతే కేశినేని భవన్ లో కూర్చొని ప్రజాసేవ చేస్తానన్నారు. తాను, తన కుటుంబం రాజకీయాల్లో జీవితాంతం ఉండాలని కోరుకోవట్లేదని స్పష్టంచేశారు. ఎవరు మంచి చేస్తే వాళ్లను అభినందిస్తానన్నారు. ఇప్పుడు కేశినేని నాని చేసిన ఈ కామెంట్స్ టీడీపీలోనూ, కృష్ణా జిల్లాలోనూ హాట్ హాట్ గా మారాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :