Radha Spaces ASBL

కేసీఆర్ 'ముందస్తు' ఆలోచన వెనుక వ్యూహమేంటి?

కేసీఆర్ 'ముందస్తు' ఆలోచన వెనుక వ్యూహమేంటి?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు దాదాపు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దూకుడు మీదున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మార్గమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా ముందస్తుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సంక్రాంతి తర్వాత ఏ క్షణాన్నయినా అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇంతకూ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు..?

2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఐదేళ్ల పదవీకాలం పూర్తికాక ముందే ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 2018 డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్లి రెండోసారి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మరోసారి ముందస్తుకు వెళ్లేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఇందుకు అనేక కారణాలను టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. వాస్తవానికి కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన లేదు. అయితే మునుగోడు ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ మదిలో ముందస్తు ఆలోచన వచ్చినట్టు సమాచారం..

మునుగోడు ఉపఎన్నిక సమయంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో కూడా షిండే తరహా స్కెచ్ ను బీజేపీ వేసిందనే ఆరోపణలున్నాయి. అంతేకాక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ కీలక నేతలపైన సీబీఐ, ఈడీ కన్నేసాయి. టీఆర్ఎస్ నేతలను ఇరుకించి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అదే సమయంలో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్ సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ వ్యూహం రచించిందనే వార్తలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నికలో గెలుస్తామని బీజేపీ చాలా గట్టిగా భావించింది. అయితే అక్కడ ఆ పార్టీ బోల్తా పడడంతో కాస్త మెత్తబడింది.

ఇప్పుడు డీలా పడిన బీజేపీని మరింత వెనక్కు నెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ ఆగితే ఈలోపు బీజేపీ రాష్ట్రంలో పలువురు నేతలను తమవైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వకూడదనుకుంటున్నారు. అందుకే బీజేపీకి ఊపిరాడనివ్వని సమయంలోనే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పటికీ సంస్థాగతంగా బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను లాక్కోవడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్. తగినంత సమయం ఇస్తే బీజేపీ కచ్చితంగా ఈ పని చేస్తుంది. అందుకే ఆ సమయం ఇవ్వకుండా ముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. అందులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని సభాముఖంగా ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నించనున్నారు.. ఆ తర్వాత సెక్రటేరియేట్, అంబేద్కర్ విగ్రహం.. లాంటి ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించి ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా కాకుండా ఇంకా ఆలస్యం చేస్తే 2018 డిసెంబర్లో కాకుండా 2019 మే వరకూ ఆగి సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందుకే దాదాపు ఏడాది ముందే అసెంబ్లీ రద్దు చేయాలనుకుంటోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :