ASBL NSL Infratech

జనంలోనే తేల్చుకుంటానంటున్న జగన్..! సాధ్యమేనా..?

జనంలోనే తేల్చుకుంటానంటున్న జగన్..! సాధ్యమేనా..?

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశమైంది. సభ్యుల ప్రమాణ స్వీకారాలు దాదాపు పూర్తయ్యాయి. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా.. రారా.. అనే దానిపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. అయితే తొలిరోజు కాబట్టి ప్రమాణ స్వీకారానికి జగన్ వచ్చారు. అయితే ఈ సందర్భంగా జగన్ ప్రవర్తించిన తీరు మాత్రం అనేక విమర్శలకు తావిచ్చింది. అయితే అసెంబ్లీలో తగినంత బలం లేదు కాబట్టి చట్టసభలను నమ్ముకోవడం కంటే జనంలోకి వెళ్లి పోరాడడమే మేలనే ఉద్దేశంతో జగన్ అసెంబ్లీని లైట్ తీసుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే జనంలోకి వెళ్లి సత్తా చాటడం అంత సులువుగా సాధ్యమవుతుందా.. అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.

అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు కూడా సభకు వస్తారనుకున్నారు. అయితే ఎవరూ రాలేదు. జగన్ చాంబర్లో అందరూ కూర్చున్నారు. ఆ తర్వాత కొంతమంది సభ్యులు సభలోకి వచ్చి కూర్చున్నారు. జగన్ మాత్రం తన పేరు వచ్చే ముందు సభలోకి వచ్చి చివర్లో కూర్చున్నారు. తర్వాత ప్రమాణం పూర్తవగానే సీటులో కూర్చోకుండానే తన ఛాంబర్ కు వెళ్లిపోయారు. తర్వాత అసెంబ్లీ నుంచి ఇంటికి వచ్చేశారు. అసలు సభలో అలా కూర్చోకుండా వెళ్లిపోవడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే అసెంబ్లీలో 11 మందితో తాను చేయగలిగిందేమీ లేదని జగన్ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకే జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో ఓదార్పు యాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరిని ఓదారుస్తారనేది తెలియాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి రాకపోవడాన్ని జీర్ణించుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారని.. అలాగే పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి పార్టీల నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అలాంటి వాళ్లను, వాళ్ల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం.

అయితే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ యాత్రలకు ఎలాంటి ఆటంకాలు ఎదురకాలేదు. ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలను, ఆఖరకు లోకేశ్ పాదయాత్రకు కూడా అనేక ఆటంకాలు కలిగించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటప్పుడు జగన్ యాత్రకు ప్రభుత్వం సహకరిస్తుందా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకపోయినా గతంలో లాగా జగన్ యాత్రకు స్పందన వస్తుందా అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఘోర పరాజయంతో కేడర్ మొత్తం నీరుగారిపోయి ఉంది. నేతలు కూడా మొహం చాటేస్తున్నారు. ఆరు నెలలు కూడా గడవకముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట యాత్ర ప్రారంభిస్తానంటే జగన్ కు ఎంతమేర సానుకూలత వస్తుందనేది వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :