ASBL NSL Infratech

జగన్ ఎలక్షన్ టీమ్ ఇదేనా..? పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారా..?

జగన్ ఎలక్షన్ టీమ్ ఇదేనా..? పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారా..?

ఏపీలో కొంతకాలంగా అధికార వైసీపీ మంచి దూకుడు మీదుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పుడుపడితే అప్పుడు అని కాకుండా ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ రావడం సీఎం జగన్ స్టైల్. ఏ నెలలో ఓ కార్యక్రమం చేపట్టాలి.. ఏ నెలలో ఎవరికి స్కీమ్ డబ్బులు విడుదల చేయాలి.. లాంటివన్నీ ముందే ఫిక్స్ చేసి పెట్టేశారు. దీంతో పాలన ఆటోమేటిక్ గా జరిగిపోతుంటుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ పైన కూడా ఫోకస్ పెట్టారు సీఎం జగన్. సందర్భానుసారం అడపాదడపా మార్పులు, చేర్పులు చేస్తూ వస్తున్నా ఇప్పుడు భారీ స్థాయిలో ప్రక్షాళన చేశారు. పలువురు కీలక నేతలను బాధ్యతల నుంచి తప్పించి మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించారు. జగన్ ఎన్నికల టీమ్ ఇదేనని కొందరు భావిస్తున్నారు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు సీఎం జగన్. ఈసారి 175కు 175 స్థానాలూ గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన వైసీపీ కార్యకర్తలు, నేతలకు పదే పదే చెప్తున్నారు. టీడీపీ గెలిచిన స్థానాలపై ముందు ఫోకస్ పెట్టిన ఆయన వరుసగా ఆ నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలు, నియోజకవర్గాలవారీగా పార్టీ బలాలు, బలహీనతలను అంచనా వేస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు జిల్లాల్లో నేతలకు కీలక బాధ్యతలతో పాటు సమన్వయ కర్తలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. పార్టీ బాధ్యతలను ఇకపై వారి భుజాన పెట్టారు. అన్ని జిల్లాలలకు అధ్యక్షులను నియమించడంతో పాటు రెండు, మూడు జిల్లాలకు కలిసి సమన్వయ కర్తలను నియమించారు.

ఏపీలో ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. గతంలో కొంతమంది నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే కొంతమంది నేతలు యాక్టివ్ గా లేరు. దీంతో ఇప్పుడు జిల్లాలకు కొత్త అధ్యక్షులతో పాటు కొంతమంది రీజనల్ కోఆర్డినేటర్లను కూడా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారిలో 8 మందిని మార్చారు. పార్వతీపురం జిల్లాకు ఇంతకుముందు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పుడు పరీక్షిత్ రాజును నియమించారు. విశాఖ జిల్లాకు అవంతి శ్రీనివాస్ ను తొలగించి పంచకర్ల రమేశ్ కు బాధ్యతలిచ్చారు. గుంటూరు జిల్లా బాధ్యతల నుంచి తనను తప్పించాలని సుచరిత కోరడంతో ఆమెను తప్పించి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అధ్యక్షుడిగా నియమించారు. ఇక ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బుర్ర మధుసూధన్ ను తొలగించి జి.వెంకటరెడ్డికి అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి బాలనాగి రెడ్డిని తొలగించి బి.వై.రామయ్యకు అప్పగించారు. అనంతపురం జల్లాను కాపు రామచంద్రా రెడ్డి నుంచి పైలా నరసింహయ్యకు అవకాశం కల్పించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నారాయణ స్వామిని తప్పించి ఎమ్మెల్సీ భరత్ కు బాధ్యతలిచ్చారు. అలాగే తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు.

అలాగే.. రీజనర్ కోఆర్డినేటర్ల నియామకంలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సజ్జల రామకృష్ణా రెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లను రీజనల్ కోఆర్డినేటర్లుగా తప్పిస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. కొడాలి నాని స్థానంలో బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డిలను నియమించారు. అలాగే బుగ్గన, సజ్జల స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో బాలినేని శ్రీనివాస రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలను నియమించారు.

వైసీపీలో చోటుచేసుకున్న ఈ మార్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తప్పించిన వారిలో కొంతమంది తమను తప్పించాలని నేరుగా సీఎం జగన్ ను కోరారు. దీంతో వారి స్థానంలో వేరే వారికి బాధ్యతలిచ్చారు. అయితే మరికొంతమందిని తప్పించడం వెనుక ఐప్యాక్ సర్వేను ఆధారంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐప్యాక్ టీమ్ ఇచ్చిన సర్వే ఆధారంగా యాక్టివ్ గా పనిచేయని వారిని తప్పించినట్లు తెలుస్తోంది. అయితే వీరి పనితీరును కూడా కొంతకాలం పరిశీలించిన తర్వాత అవసరమైతే మరోసారి మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం ఉందనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :