ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏప్రిల్ 3న పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం..!

ఏప్రిల్ 3న పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఈ ఆసక్తి మరింత పెరిగింది. అంతకు ముందు వరకూ వైసీపీకి తిరుగులేదనే ఫీలింగ్ లోనే అటు పార్టీలు, ఇటు ప్రజలు ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 4 చోట్ల ఓడిపోవడంతో ఆ పార్టీ పతనం ప్రారంభమైందనే ప్రచారం జోరందుకుంది. టీడీపీ వేగంగా పుంజుకుందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపని ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో పార్టీపై లోతుగా చర్చించేందుకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్.

జగన్ అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్నాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. పాలనను, పార్టీ యంత్రాంగాన్ని సమ్మిళతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో పార్టీ బాగా పుంజుకుంది. క్షేత్రస్థాయి వరకూ బలమైన కేడర్ ను సంపాదించుకోగలగింది. ఒకప్పుడు టీడీపీకి మాత్రమే పరిమితం అయిన ఈ కేడర్ ఇప్పుడు అంతకు మించి సంపాదించుకుంది వైసీపీ. దీంతో ఇప్పట్లో వైసీపీని కొట్టేవాళ్లే లేరని అందరూ అనుకున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసి 175 సీట్లనూ గెలుచుకోవాలని సీఎం జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ స్పీడ్ కు బ్రేకులు వేశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ జోరు ఏకఛత్రాధిపత్యంగా సాగుతూ వస్తోంది. ఏ ఎన్నిక జరిగినా వైసీపీ తిరుగులేని మెజారిటీతో గెలుస్తూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ కనుమరుగైపోయింది. అదే ఉత్సాహంతో ఈసారి ఆ 23 సీట్లను కూడా టీడీపీకి దక్కకుండా చేయాలనుకున్నారు. అయితే అన్నీ అనుకున్నట్టు అవి రాజకీయాలెందుకవుతాయి. వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలడంతో పార్టీ ఒక్కసారిగా కుదేలైపోయింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబావుటా ఎగరేయడంతో జగన్ ఒక్కసారిగా ఖంగుతున్నారు. దీంతో పార్టీని ప్రక్షాళించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏప్రిల్ 3న పార్టీ ప్రజాప్రతినిధులందరితో పాటు జిల్లా బాధ్యులతో జగన్ భేటీ కాబోతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, గీత దాటితే ఎదుర్కోబోయే అంశాలు, మున్ముందు ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు.. లాంటి అనేక అంశాలను జగన్ ప్రస్తావిస్తారని సమాచారం. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు ఒక గట్టి సందేశాన్ని జగన్ ఇస్తారని తెలుస్తోంది.

అంతేకాక ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలకు కూడా జగన్ క్లారిటీ ఇస్తారని సమాచారం. ఒకవేళ మంత్రివర్గాన్ని విస్తరించాలనుకుంటే దాన్ని కూడా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. మొత్తంగా ఈ సమావేశం గతానికి భిన్నంగా కాస్త వాడివేడిగా జరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :