Radha Spaces ASBL

కేసీఆర్, జగన్ కలవబోతున్నారా..?

కేసీఆర్, జగన్ కలవబోతున్నారా..?

ఏపీ, తెలంగాణ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ప్రజల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రాజకీయంగా పార్టీల మధ్య, పాలనాపరంగా ప్రభుత్వాల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల అధికార పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది ఇద్దరి మధ్య మంచి సంబంధాలే నడిచాయి. కానీ ఆ తర్వాత గ్యాప్ బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు మళ్లీ కలవబోతున్నారనే వార్త గట్టిగా వినిపిస్తోంది.

2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అప్పుడు ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. వాళ్లిద్దరి మధ్య ఐదేళ్లూ గ్యాప్ ఉండిపోయింది. కేంద్రంలోని బీజేపీతో అనుకూలంగా ఉన్న తెలుగుదేశం.. తెలంగాణకు చెందిన 7 మండలాలను లాగేసుకుందనే కోపం కేసీఆర్ కు ఉండేది. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు వ్యవహారం వెలుగులోకి రావడంతో చంద్రబాబు హైదరాబాద్ వదిలేసి అమరావతికి వెళ్లిపోయారు. అయినా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించారు. కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయినా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు. ఆ తర్వాత 2019లో ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. దీంతో జగన్ తో సత్సంబంధాలు నెరిపారు కేసీఆర్.

మొదటి ఏడాది ఏపీ, తెలంగాణ మధ్య మంచి సంబంధాలే నడిచాయి. జగన్ ఇంటిక కేసీఆర్, కేసీఆర్ ఇంటికి జగన్ కుటుంబసమేతంగా హాజరై విందు భోజనాలు కూడా చేశారు. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య గ్యాప్ తొలగిపోయి మంచిరోజులొచ్చాయని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత సీన్ మారింది. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు, కృష్ణా జలాల్లో వాటా, శ్రీశైలం విద్యుత్.. లాంటి అనేక అంశాలపై ఏపీ పట్టుబట్టింది. వీటిపై తెలంగాణ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అప్పుల్లో ఉన్న తమను ఆదుకోవాలని, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించేలా చూడాలని జగన్ పదే పదే కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ఇది సహజంగానే కేసీఆర్ కు కోపం తెప్పించింది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ మళ్లీ పెరిగిపోయింది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల అధికార నేతల మధ్య మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు కేసీఆర్, జగన్ ఒకే వేదికపై కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖలోని శారదాపీఠం బ్రహ్మోత్సవాలు ఎల్లుండి నుంచి నెలాఖరు వరకూ జరగనున్నాయి. అందులో భాగంగా 28న రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఆ యాగానికి ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవుతారని తెలుస్తోంది. అదే జరిగితే వీళ్లిద్దరి మధ్య గ్యాప్ తొలగిపోయి రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ మంచి సంబంధాలు వస్తాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా నీటి వివాదాలు, విభజన సమస్యలు, బకాయిలు.. లాంటి అనేక అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే కేంద్రం వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. అది జరగకపోవడం వల్లే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ ఆ దిశగా మొగ్గు చూపుతారా.. అనేది చూడాలి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :