ASBL NSL Infratech

చక్రం తిప్పడంలో కేసీఆర్‌పై చంద్రబాబు పైచేయి..!!

చక్రం తిప్పడంలో కేసీఆర్‌పై చంద్రబాబు పైచేయి..!!

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీలకు అస్సలు మింగుడు పడడం లేదు. అలాంటి వాటిలో భారత్ రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ ముందుంటుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి బీఆర్ఎస్ కు లోక్ సభలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే తొలిసారి. దేశాన్ని ఏలాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్.. అసలు ఢిల్లీ గడపే తొక్కలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో చంద్రబాబు ఢిల్లీని మళ్లీ చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. చంద్రబాబును చిన్నచూపు చూసి ఎద్దేవా చేసిన కేసీఆర్ కనుమరుగైపోతున్నారు.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి చంద్రబాబు, తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మొదట్లో ఇద్దరి మధ్య, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన తర్వాత బెడిసికొట్టాయి. 2018లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాగా 2019లో చంద్రబాబు ఓడిపోయి జగన్ విజయం సాధించడంతో వాళ్లిద్దరి మధ్య దోస్తీ బలపడింది. ఇద్దరూ చంద్రబాబు టార్గెట్ గా పనిచేశారు. చంద్రబాబును చిన్నచూపు చూస్తూ సెటైర్లు వేసుకున్నారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఓడిపోయారు. ఏపీలో చంద్రబాబు ఘనవిజయం సాధించారు. పైగా కేసీఆర్ ను ముప్పతిప్పలు పెడుతున్న బీజేపీతో కలిసి చంద్రబాబు విజయం సాధించడంతో బీఆర్ఎస్ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. తెలంగాణలో చంద్రబాబు అనుచరుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వాళ్లను మరింత జీర్ణించుకోలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ ఫ్యోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కుమార్తె కవిత లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నారు. ఎన్నికల్లో అసలు ఒక్కసీటు కూడా సాధించలేకపోయారు. ఇలా కేసీఆర్ పై ముప్పేట దాడి జరుగుతోంది.

చంద్రబాబు వయసు మీద పడడంతో అందరూ ఆయన పనైపోయిందనుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని శక్తిగా ఎదిగారని సంబరపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అదే జరిగింది. ఒక్క ఎన్నిక ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఒకరు ఇంటికి పరిమితం కాగా.. మరొకరు అందనంత ఎత్తుకు ఎదిగి చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ పరిస్థితి చూసిన వాళ్లంతా బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయి అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :