ASBL NSL Infratech

బీఆర్ఎస్ లో భవిష్యత్ టెన్షన్..!?

బీఆర్ఎస్ లో భవిష్యత్ టెన్షన్..!?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించింది టీఆర్ఎస్. 14ఏళ్ల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించగలిగారు. ఆ తర్వాత పదేళ్లపాటు ఆయన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. దాదాపు పాతికేళ్లపాటు టీఆర్ఎస్ ప్రస్థానం వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదన్నట్టు సాఫీగా సాగిపోయింది. ఉద్యమకాలంలో దూకుడు, ఆ తర్వాత అధికారం దక్కడంతో అన్నీ అనుకున్నట్టు జరిగిపోయాయి. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఏర్పడింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా సరిగ్గా ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితిని ఆ పార్టీ చూసింది. ఎలాగోలా ఎన్నికలు ఎదుర్కొన్నా ఇప్పుడు ఆ పార్టీని ఓటమి భయమే ఎక్కువగా వెంటాడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రావచ్చు లేదంటే అదీ రాకపోవచ్చని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోతే ఆ పార్టీ భవిష్యత్ ఏంటనేది ఆ పార్టీ నేతలను వేధిస్తోంది.

బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికలు ముగిసే దాకా పార్టీ ఫిరాయింపుల జోలికి వెళ్లకూడదని కాంగ్రెస్ భావించడంతో దానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేయబోతున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే మరికొందరు సీనియర్ నేతలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. కొందరు కాంగ్రెస్ లోకి, మరికొందరు బీజేపీలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అంతుచిక్కడం లేదు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీని తట్టుకుని ఐదేళ్లపాటు బీఆర్ఎస్ నిలబడగలుగుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణను దున్నేశాం.. ఇక దేశాన్ని ఏలాల్సిన సమయం ఆసన్నమైంది అని కేసీఆర్ పార్టీ పేరును కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చేశారు. కానీ ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ సమస్య నుంచి కేసీఆర్ ఎలా బయటపడతారనేది ఆసక్తి రేపుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :