ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అవినాశ్ అరెస్టు ఖాయమా..? కర్నూలులో టెన్షన్ టెన్షన్..!!

అవినాశ్ అరెస్టు ఖాయమా..? కర్నూలులో టెన్షన్ టెన్షన్..!!

అవినాశ్ రెడ్డి, సీబీఐ మధ్య దాడుగు మూతలు కొనసాగుతున్నాయి. అరెస్టు చేసేందుకు సీబీఐ ముందుకెళ్తుంటే.. అవినాశ్ రెడ్డి మాత్రం ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారు. ఇన్నాళ్లు పులివెందుల, హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ తిరిగిన వివేకా హత్య కేసు విచారణ ఇప్పుడు కర్నూలుకు మారింది. అవినాశ్ రెడ్డి తప్పి అక్కడ చికిత్స పొందుతూ ఉండడంతో అందరి చూపూ అక్కడే ఉంది. సీబీఐ కూడా కర్నూలులో మకాం వేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది సీబీఐ. ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే అవినాశ్ రెడ్డి మాత్రం విచారణకు హాజరు కాలేదు. పైగా తాను విచారణకు హాజరు కాలేనని.. తన తల్లి గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్నందున్న తాను దగ్గరుండి చూసుకోవాల్సి ఉందని సీబీఐకి లేఖ రాశారు. తన తండ్రి ఇప్పటికే జైలులో ఉన్నందున కుమారుడిగా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అందుకే తనకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఒక వైపు సీబీఐ లేఖ రాసిన అవినాశ్ రెడ్డి.. మరోవైపు తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై వెంటనే విచారణ జరపాల్సిందిగా ఇంటీరియమ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు దాఖలు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు దీన్ని విచారించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. రేపు ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుప్రీంకోర్టులో ఇప్పటికిప్పుడు అవినాశ్ కు ఊరట లభించలేదు. మరోవైపు ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే కౌంటర్ దాఖలు చేసేందుకు వై.ఎస్.సునీత న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

మరోవైపు అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీని కలిసి అవినాశ్ ను లొంగిపోవాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఒకవేళ తమ ఆదేశాలను ధిక్కరిస్తే అవినాశ్ ను బలవంతంగా అయినా అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఇందుకోసం బందోబస్తు కల్పించాల్సిందిగా ఎస్పీని కోరినట్టు తెలుస్తోంది. దీంతో కర్నూలులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అవినాశ్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అయితే అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని, చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి సీబీఐకి సూచించారు. ఇలా కర్నూలులో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :