ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీలో గులకరాయి రాజకీయం!

ఏపీలో గులకరాయి రాజకీయం!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం సమీపిస్తోంది. నామినేషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. అయితే అన్ని పార్టీలూ ఇప్పుడు జగన్ పై దాడి అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కోడికత్తి ప్రచారాస్త్రం కాగా ఈసారి గులకరాయి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇది టీడీపీ పనేనని అధికార పార్టీ ఆరోపిస్తుంటే.. ఇది కూడా కోడికత్తి లాగా డ్రామాయేనని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.

విజయవాడలో జగన్ ప్రచారం సందర్భంగా ఆయనపై దాడి జరిగింది. రాయి బలంగా తాకడంతో నుదుటిపై గాయమైంది. మూడు కుట్లు కూడా పడ్డాయి. ఒకరోజు విరామం తీసుకున్న అనంతరం జగన్ తన యాత్ర కొనసాగించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు రాయి ఎవరు విసిరారనేదానిపై విచారణ మొదలు పెట్టారు. దాదాపు వారం రోజుల తర్వాత సతీష్ అనే యువకుడు రాయి విసిరినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అతడిని కోర్టులో కూడా హాజరు పరిచారు. సతీశ్ తనకుతానుగా రాయి విసరలేదని..

దుర్గారావు అనే వ్యక్తి చెప్పడం వల్లే రాయి విసిరాడని పోలీసులు ఛార్జ్ షీటులో పేర్కొన్నారు. దుర్గారావు అనే వ్యక్తి స్థానిక టీడీపీ లీడర్ గా ఉన్నాడు. దుర్గారావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇంతవరకూ కోర్టు ముందు హాజరు పరచలేదు. నాలుగు రోజులైనా దుర్గారావు ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు, స్థానిక వడ్డెర బస్తీవాసులు ఆందోళనకు దిగారు.

అయితే దుర్గారావును ఈ కేసులో ఇరికించి టీడీపీకి చెందిన ప్రధాన నేతల పేర్లు చెప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బొండా ఉమకు దుర్గారావు సన్నిహితుడు కావడంతో బొండా పేరు చెప్పేలా దుర్గారావును హింసిస్తున్నారని.. అందుకే అరెస్టు చూపకుండా ఆలస్యం చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.

మొత్తానికి ఇప్పుడు గులకరాయి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ నేత బొండా ఉమ గూటికి చేరేలా కనిపిస్తోంది. అదే జరిగితో బొండా ఉమను కూడా అరెస్టు చేయడం ఖాయం. అయితే అరెస్టు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. గులకరాయి ద్వారా సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ చెప్తోంది. అయితే గతంలో కోడికత్తికి వచ్చినంత సానుభూతి ఈసారి కనిపిస్తుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో ఇదంతా వైసీపీ, పోలీసులు ఆడిస్తున్న డ్రామా అని.. టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేస్తున్నారనే వాళ్లూ ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :