ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ
విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని విశ్రాంత ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్లు అయితే అందరి హక్కులకు రక్షణ ఉంటుందన్నారు. వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు వ్యక్తుల స్వాతంత్య్రం కాపాడబడుతుందన్నారు. పెన్షనర్ల హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాలరాస్తుందని, విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాజకీయ పార్టీ పెట్టి తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు సుబ్బరాయన్ అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. సకాలంలో పెన్షన్లు అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ ఏర్పాటు చేశామని, రాబోయే ఎన్నికల్లో అన్ని అర్బన్ ప్రాంతాల్లో పెన్షనర్స్ పార్టీ పోటీలో ఉంటుందన్నారు. పెన్షనర్ల హక్కుల కోసం యువత భవిష్యత్తు కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.