గామా అవార్డ్స్ లో "బేబి" సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న ఆనంద్ దేవరకొండ
దుబాయ్ లో ఘనంగా జరిగిన గామా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. "బేబి" సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు గామా అవార్డ్ సొంతమైంది. ఆనంద్ కు ఇదే ఫస్ట్ బిగ్ అవార్డ్. నటుడిగా ఆనంద్ ప్రతిభకు దక్కబోయే అవార్డ్స్ కు ఇదే ఫస్ట్ స్టెప్ గా భావించవచ్చు. దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సినిమాతోనే ఒక మంచి ప్రయత్నం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి సినిమాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. సినిమా రిజల్ట్ తో పనిలేకుండా రొటీన్, రెగ్యులర్ ఫార్మేట్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన మూవీస్ చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన బేబి సినిమా ఆనంద్ దేవరకొండకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమాలో భగ్న ప్రేమికుడిగా ఆనంద్ నటన ప్రేక్షకుల మనసులను తాకింది. గామా అవార్డ్స్ లో బేబి సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కడం ఆనంద్ పడిన కష్టానికి, ఆయన నట ప్రతిభకు దక్కిన బహుమతి అనుకోవచ్చు. ఈ అవార్డ్ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి సినిమాల్లో ఆనంద్ నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన గం గం గణేశా, డ్యూయెట్ సినిమాలతో పాటు బేబి టీమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్నాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.