అక్కడ ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం ... మాకు లేదు
నాగార్జున సాగర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ వద్ద మేం చేసిన చర్య న్యాయమైనది, ధర్మమైనది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేది అని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సాగర్ గేట్లను సమంగా పంచారు. ఆంధ్రప్రదేశ్ గేట్లను కూడా తెలంగాణ అధికారులే ఆపరేట్ చేస్తున్నారు. కుడి కాల్వ నిర్వహణ తెలంగాణ చేతుల్లోకి ఎందుకు వెళ్లిందో ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనూ తెలంగాణ పోలీసుల చెక్‌పోస్టులు ఉన్నాయి. మేం తెలంగాణ వారి గేట్లు ఆపరేట్ చేయలేదు. తాగునీటి కోసం కూడా తెలంగాణ అనుమతి తీసుకోవాలా? 2 వేల క్యూసెక్యులు తాగునీటి కోసం విడుదల చేశాం అన్నారు.
తెలంగాణలో మా పార్టీ లేదు. అక్కడ ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం మాకు లేదు. మా నీటిని విడుదల చేసుకునే స్వేచ్ఛ మాకు కావాలి. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ వాడుకుంటోంది. పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే మేం ఉన్నాం. తెలంగాణ వాటా మేం అడగం. మా వాటా వదులుకోం. ఇకపై ఆంధ్రప్రదేశ్ వాటా వినియోగంపై మేమే నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.