ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో జెఫ్ బెజోస్ నిశ్చితార్థం!

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆయన ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. వీరివురు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. లారెన్ ఇటీవల హృదయాకారంలో ఉన్న చేతి ఉంగరాన్ని ధరించడం ప్రారంభించినప్పటి నుంచి ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. లారెన్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బెజోస్, లారెన్ 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు సమచారం. అయితే 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరివురికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్, బెజోస్ తమ మధ్య బంధాన్ని బయటకు అధికారికంగా వెల్లడించలేదు. బెజోస్ నుంచి మెకంజీ 38 బిలియన్ డాలర్లు పొందారు. దీంట్లో సగం దాతృత్వ కార్యక్రమాల కోసం వితరణ చేశారు. మరోవైపు లారెన్ కు గతంలో పాట్రిక్ వెబ్‌సైల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరివురికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది.