కూటమిలో క్రాస్ ఓటింగ్ భయం.. గుర్తుల విషయంలో కన్ఫ్యూషన్..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ప్రచారాలతో వేడెక్కుతున్నాయి. ఇప్పుడు మొదలైన నామినేషన్ల సందడి వీటిని మరింత ఉదృతం చేస్తుంది. అయితే రాబోయే ఎన్నికల్లో నేతలకంటే కూడా పెద్ద ఛాలెంజ్ ఓటర్లు ఎదుర్కోబోతున్నారు. ఎలాగంటే 2014లో ఉన్న దాని కంటే కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో చాలా భిన్నత కనిపిస్తుంది. కూటమి ఏర్పడడంతో సీట్ల పంపిణీ విషయంలో నాయకులు ఎంత గందరగోళం ఎదుర్కొన్నారో రేపు ఓట్లు వేసేటప్పుడు ఓటర్లు అంతకుమించి గందరగోళం ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు సేఫ్ అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారు కాబట్టి సైకిల్ గుర్తుకు ఇబ్బంది లేదు. అయితే ఇబ్బంది అంతా కమలానికి, గాజు గ్లాసుకే అనిపిస్తోంది. ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఓటరు అసెంబ్లీ ఓటుతో పాటు లోక్ సభ ఓటు కూడా వేయాలి. ఇక్కడే అసలు చిక్కు ప్రారంభమవుతుంది. ఉదాహరణకి అసెంబ్లీ సీటు గాజు గ్లాసుకి వేస్తే.. ఎంపీ సీటు సైకిల్ కి వేయాలి అనే విషయం ఓటర్కి అర్థమయ్యేలా వివరించి చెప్పే బాధ్యత నాయకులది, కార్యకర్తలది. అయితే బీజేపీ లోకల్ నాయకులు ప్రచారంలో పెద్దగా పాల్గొంటున్నట్టు కనిపించడం లేదు. కూటమిలో పసుపు జెండా కనిపించినంత ఘనంగా మిగిలిన రెండు జెండాలు కనిపించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల గుర్తులు జనాల మెదడులోకి ఎంతవరకు ఎక్కుతున్నాయి అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. మాకు ఓటు వేయండి అని అడగడం కంటే కూడా కూటమి నేతల ముందుగా దేనికి ఏ గుర్తుకి ఓటు వేయాలి అనే విషయం ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇది జరక్కపోతే క్రాస్ ఓటింగ్ జరిగి మొదటికి మోసం వచ్చే అవకాశం ఉంది.