అఖిల్ అడిగితే వారు వచ్చేస్తారా?

అఖిల్ అక్కినేని ఎప్పటికప్పుడు హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా ఏజెంట్ సినిమాతో గట్టిగా నిలబడాలని ప్లాన్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను చేస్తున్నాడు. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చెప్పిన టైమ్ కు రిలీజ్ అవుతుందని కొంతమంది అంటుంటే, మరికొంత మంది ప్రమోషన్లు సరిగా చేయకపోవడంతో సినిమా మే కి వాయిదా పడుతుందంటున్నారు.
అయితే వీటన్నింటినీ పట్టించుకోకుండా నిర్మాత అనిల్ సుంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నాడట. ట్రైలర్ లాంచ్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అన్ని పనులను డైరెక్టర్ తో కలిపి అనిల్ సుంకర చూసుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రీ రిలీజ్ కోసం వచ్చే గెస్టుల భారం మాత్రం అఖిల్ పైనే వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరినీ ఏజెంట్ ప్రీ రిలీజ్ కు తీసుకొస్తే, సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వస్తుందని అనిల్ అలా ప్లాన్ చేశాడట. అఖిల్ కు ఎలాగూ ఆ ఇద్దరి హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఎలాగైనా అఖిల్ కు వాళ్లను తీసుకువచ్చేలా చేయమని అనిల్ చెప్పాడట. అయితే ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ ఈవెంట్లకు తప్ప బయట ఎక్కడా ఏ ఈవెంట్ కు అటెండ్ అవలేదు.
కానీ అయ్యగారు అఖిల్ తలచుకుంటే ఇది జరగడం సాధ్యమని అనిల్ ఆలోచన. సురేందర్ రెడ్డికి ఎలాగూ మెగా ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది కాబట్టి చరణ్ ను తీసుకురావడం ఈజీనే అనుకున్నా, ఇటు ఎన్టీఆర్ 23 నుంచి కొరటాలతో షూట్‌కు వెళ్లనున్నాడు. ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు నిర్విరామంగా జరగనుందట. మరి ఇంత బిజీలో ఎన్టీఆర్ అఖిల్ మాటను కాదనకుండా వస్తాడా? చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ప్రీ రిలీజ్ తో ఏజెంట్‌కు బజ్ పెంచుతారా? ఏదైనా సరే ఈ ప్రీ రిలీజ్ తో అఖిల్ భుజాలపై మరింత బరువే పడింది.