ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. రాష్ట్ర ప్రజలు వైసీపీని

రాష్ట్రంలో ఓటర్ల లిస్ట్ కంటే వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ద్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. పాడి రైతుల ప్రగతికి కృషి చేస్తున్న నరేంద్ర, రైతులపై దాడి చేయించారంటే ఎవరైనా నమ్ముతారా అని నిలదీశారు. సంగం డెయిరీని ఆక్రమించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ఇక ఐదు నెలల మాత్రమే మిగిలి ఉన్నాయని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకొండి అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తన్ని తరిమేస్తారని హెచ్చరించారు.






