ASBL NSL Infratech

18 వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ - అదిరిపోయిన ఆరంభం, అన్ని హంగులతో వేడుకలు ప్రారంభం

18 వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ - అదిరిపోయిన ఆరంభం, అన్ని హంగులతో వేడుకలు ప్రారంభం

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు, ఈ రోజు రానే వచ్చింది. తెలుగు వారితో పాటు మిగతా వారు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎదురు చూసిన అత్యంత పెద్ద తెలుగు పండుగ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్ తో మొదలయ్యింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ ప్రాంగణం రకరకాల కళా కృతులతో అత్యంత సుందరంగా ముస్తాబయింది. 2000, 2012 సంవత్సరాల తరువాత ఈ సభలు అట్లాంటాలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ చక్కనైన సాయంత్రం ఎంతో మంది ఒక చోట సరదాగా, ఆప్యాయంగా కలిసి జరుపుకోవడం శ్లాఘనీయం. జ్యోతి ప్రజ్వలన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం మరియూ అధ్యక్షురాలు మధు బొమ్మినేని విచ్చేసిన అందరికీ ఈ వేడుకలకు సాదర స్వాగతం పలికారు. వీరితో పాటు కోర్ కమిటీ సభ్యులు కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఏ కార్యక్రమానికైనా స్పాన్సర్లు మూల స్థంబాలు, వీరు లేనిదే ఏ పనీ ముందుకు నడవదు. కోర్ కమిటీ తో పాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీస్ కలిసి స్పాన్సర్లను సగౌరవంగా సత్కరించారు. ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారిని గుర్తించి, వారి నుండి కొంత మందిని  ఎంపిక చేశారు, వీరికి ఆటా అవార్డులు ప్రధానం చేయడం జరిగింది. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునాయి.

తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఒక ఎత్తు. యువత ప్రత్యేకంగా కలవడం, కార్యక్రమాలు చేసుకోవడం, విడిగా భోజనాలు చేయడం ఆటా వారు వీరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తుంది.  

నవత, యువత, భవితకు  ఆటా పెద్ద పీట వేస్తుందని ప్రెసిడెంట్ మధు బొమ్మినేని చెప్పి, వీటి ప్రాముఖ్యాన్ని విశదీకరించారు. ఇంకా ఎన్నో ఆకట్టుకునే ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ, అందరూ హాజరు కావాలని కోరారు. అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుండి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు విపులీకరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి, వాటిలో అందరం కలిసి పాల్గొని ఆనందిద్దాం.  

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :