ASBL NSL Infratech

ముయిజ్జుకే మాల్దీవుల పట్టం..

ముయిజ్జుకే మాల్దీవుల పట్టం..

భారత విదేశాంగవిధానానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాల మిత్రపక్షం మాల్దీవుల్లో చైనా అనుకూల ముయిజ్జు ప్రభుత్వం మరింత బలోపేతమైంది. మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) ‘సూపర్‌ మెజార్టీ’తో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను సొంతంగా 68 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి దేశంలో బలమైన మద్దతు లభించినట్లయింది. ఆయనకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్‌లు నిశితంగా పరిశీలించాయి.

మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌)లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 2.84 లక్షల ఓటర్లు ఉండగా.. 75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఫలితాల్లో ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ 68 స్థానాలు గెల్చుకోగా.. దాని మిత్రపక్షాలు మాల్దీవ్స్‌ నేషనల్‌ పార్టీ (ఎంఎన్‌పీ) ఒకటి, మాల్దీవ్స్‌ డెవలప్‌మెంట్‌ అలయెన్స్‌ (ఎండీఏ) రెండు సీట్లను గెల్చుకుంది. దీంతో 71 స్థానాలతో కూటమి.. ‘సూపర్‌ మెజార్టీ’ సాధించింది. దీనివల్ల రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం కూడా ముయిజ్జుకు లభిస్తుంది.

భారత్‌కు అనుకూలంగా ఉండే మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) 15 సీట్లకే పరిమితమైంది. ఈ పార్టీ గతంలో 65 స్థానాలను గెలుచుకోగా.. ప్రస్తుతం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా నూతన అధ్యక్షుడు ముయిజ్జు అనుసరిస్తున్న భారత వ్యతిరేక విధానానికి .. మాల్దీవుల ప్రజలు మద్దతిచ్చినట్లైంది. ఫలితంగా చైనా అనుకూల ప్రభుత్వం మరింత బలోపేతమైంది. ఇప్పటికే భారత వ్యతిరేక విధానంతో ముందుకెళ్తున్న ముయిజ్జు సర్కార్.. ఇకపై మరిన్ని భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అవకాశముందంటున్నారు నిపుణులు.

దశాబ్దాలుగా మాల్దీవులకు భారతదేశం పెద్దన్నలా ఉంటూ... కష్ట సమయాల్లో ఆదుకుంది. అయినా పొరుగుదేశంలో భారత వ్యతిరేకత ఎందుకు అంతగా పెరిగింది. మాల్దీవుల ప్రజలు ఎందుకు భారత్ కు వ్యతిరేకమయ్యారు. ఓవైపు భారత్ ..తాను సాయం చేస్తున్నట్లు భావించగా, మాల్దీవుల జనంలో మాత్రం తమ సొంత కార్యకలాపాల్లో భారత్ జోక్యం అధికమైందన్న భావన పెరిగింది. ముఖ్యంగా ఎండీపీ.. భారత సర్కార్ చేతిలో కీలుబొమ్మగా అక్కడి ప్రజలు భావించడం కూడా ముయజ్జుకు కలిసివచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ముయిజ్జు ఎలాంటి విధానం అవలంభించారో.. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి బంపర్ మెజార్టీ కొట్టేశారు. ఇప్పుడు ఆదేశం అనుసరించనున్న, అనుసరిస్తున్న చైనా అనుకూల విదేశీ విదానానికి మోడీ సర్కార్ ఎలా కౌంటరిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :