ASBL NSL Infratech

అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్: జగ్గారెడ్డి

అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్: జగ్గారెడ్డి

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను అబద్ధాల ప్రొఫెసర్‌గా అభివర్ణించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ తన ఇంటి పేరును కల్వకుంట్ల నుంచి అబద్ధాల అని మార్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు. ఆదివారం నాడు గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరెంట్ కోతలపై ఈ మధ్యనే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నడూలేని విధంగా ప్రస్తుతం కరెంట్ కోతలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్నప్పుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లానని, అక్కడ భోజనం చేస్తుండగా రెండుసార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ ఈ మధ్యనే ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై అధికారపక్ష  నేతలు ఎదురుదాడికి దిగారు.

ఈ వ్యాఖ్యలపైనే తాజాగా స్పందించిన జగ్గారెడ్డి.. కేసీఆర్ బాధ రాష్ట్రంలో కరెంట్ కోతల గురించి కాదని, తన పొలిటికల్ పవర్ కట్ అయినందుకని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటను ఇక నమ్మే అవకాశం లేదని అన్నారు. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్‌లో కేసీఆర్ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా..?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ పెద్ద అబద్ధాల ప్రొఫెసర్ అని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన తన ఇంటి పేరును కల్వకుంట్ల అని తీసేసి అబద్ధాల అని పెట్టుకోవాలని జగ్గారెడ్డి సెటైర్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లన్నీ గెలిస్తే అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని అవుతారని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :