ASBL NSL Infratech

కూటమికి గ్లాస్ ట్రబుల్..

కూటమికి గ్లాస్ ట్రబుల్..

చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు.. వైసీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. ఎన్నికల ముందు విపక్ష కూటమిపై పిడుగు పడిందని చెప్పాలి. జనసేన సింబల్ అయిన గ్లాసును ఎన్నికల కమిషన్ అధికారులు.. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం.. కూటమికి మైనస్ అని చెప్పొచ్చు. ఇది ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి ఉండడంతో.. ఎలా డీల్ చేయాలన్న అంశంపై కూటమినేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.

అసలు ఏం జ‌రిగింది?

ప్రస్తుత ఎన్నిక‌ల్లో భాగంగా 175 అసెంబ్లీ స్థానాల్లో 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు జనసేన పోటీ చేస్తోంది. కూటమి తరపున జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరు గాజుగ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నారు.అయితే వీరితో పాటు రాష్ట్రస్థాయిలో బరిలో నిలబడిన వందలాది స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు.. మొత్తంగా చూస్తే దాదాపు 17 వంద‌ల మందికి ఎన్నిక ల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించారు.

విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఎన్నికల సంఘం ఆ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిందని ఇండిపెండెంట్లకు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారు.అయితే అలాంటి ఆదేశాలు తమకు రాలేదని.. చెప్పి రిటర్నింగ్ అధికారి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు.జగ్గంపేటలో జనసేన పార్టీకి చెందిన సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఆక్కడ కూడా ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పినా రిటర్నింగ్ అధికారులు గుర్తుల కేటగిరిలో గ్లాస్ ఉందని చెప్పి కేటాయించారు.

ఇప్పుడీ పరిణామమే కూటమికి గుబులు రేపుతోంది. ఎందుకంటే... జ‌న‌సేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పైగా జ‌న‌సేన పార్టీ గుర్తు కూడా.. ఇదే కావ‌డంతో వారంతా .. తెలిసో తెలియ‌కో.. గాజు గ్లాసుకే ఓటే వేస్తే.. అది కూట‌మి పార్టీల అభ్యర్థుల‌ను ఓడించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దీంతో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని తలలు పట్టుకున్నాయి కూటమి పార్టీలు.

వారం రోజుల క్రితమే కూట‌మి పార్టీలు ఈ అంశంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి అర్జీలు పెట్టాయి. కానీ, ఎన్నిక‌ల సంఘం వీరి విన్నపాలు ప‌ట్టించుకోలేదు. తాజాగా నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ కూడా పూర్తయిన ద‌రిమిలా.. స్వతంత్ర అభ్యర్థుల‌కు గుర్తుల‌ను కేటాయించేశారు. దీంతో ఇక‌, ఆయా గుర్తుల‌ను వెన‌క్కి తీసుకునే అవ‌కాశం లేదు. ఈ ప‌రిణామం.. కూట‌మిపై పెను ప్రభావం చూపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్రధాన కార‌ణం.. జ‌నసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కాక‌పోవ‌డం. అంటే.. గుర్తింపు పొందిన పార్టీ కాక‌పోవ‌డ‌మేనని తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :