ASBL NSL Infratech

అనకాపల్లిలో గెలిచేదెవరు..?

అనకాపల్లిలో గెలిచేదెవరు..?

ప్రస్తుత ఎన్నికల్లో అనకాపల్లి హాట్ సీట్ గా మారింది. ఓవైపు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మరోవైపు సీఎం రమేష్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇందులో బూడి ముత్యాలనాయుడు స్థానికుడు కావడం, కులసమీకరణాలు కలిసి రావడంతో.. పక్కాగా గెలుస్తాడన్న ఉద్దేశ్యంతో బూడికి సీఎం జగన్ అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించారు. అయితే బూడికి సీటివ్వడం కార్యకర్తలకు సంతోషంగానే ఉన్నా.. ఆయన కుటుంబంలో విభేదాలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి.

రెండో భార్య కూతురు ఈర్లె అనూరాధకు మాడుగుల టికెట్ కేటాయించడంతో మొదటి భార్య కొడుకు బూడి రవికుమార్.. తండ్రిపై తిరుగుబాటు చేశాడు. తన తండ్రిని ఓడించాలంటూ నియోజకవర్గంలో ప్రచారం సైతం నిర్వహిస్తున్నాడు. కొడుక్కే న్యాయం చేయని వాడు.. నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఈ పరిణామం కాస్త .. బూడికి ఇబ్బందికరంగా మారింది.

మరోవైపు...కూటమి తరఫున లోక్‌సభ అభ్యర్థిగా నిలిచిన రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్‌ కు.. స్థానికుడు కాకపోవడం ఇబ్బందికరంగా తయారైంది. అయితే అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉండడం.. దీనికి తోడు చంద్రబాబుతో సాన్నిహిత్యం వెరసి... సీఎం రమేష్ కు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ముందునుంచే ఈ స్థానాన్ని దృష్టిలె పెట్టుకుని ముందుకు వెళ్లిన రమేష్.. నియోజకవర్గంలోని ఏడు శాసనసభ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల్లోనే రమేష్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆయన కుటుంబసభ్యులంతా అనకాపల్లిలో ఇల్లు తీసుకుని, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. స్థానిక నాయకుల సహకారం తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో శాసనసభ స్థానం బాధ్యతలు తీసుకుని అక్కడ అన్ని పార్టీల నేతలను సమన్వయం చేస్తున్నారు. మూడు, నాలుగు సంస్థలతో సర్వేలు చేయిస్తూ, ప్రజాభిప్రాయం, రాజకీయ సమీకరణాలపై సమాచారం సేకరిస్తూ తదనుగుణంగా శాసనసభ నియోజకవర్గ అభ్యర్థుల పరంగానూ సమన్వయం చేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో గుర్తిస్తూ అక్కడ రమేష్‌ బృందం వాలిపోతోంది. ఇక్కడ కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడం కొంత సవాల్‌గా ఉండటంతో అనుబంధ సంస్థలతో కలిసి ఈ విషయంలో ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :