ASBL NSL Infratech

రేవంత్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు...?

రేవంత్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు...?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. రాజకీయంగా చంద్రబాబుకు శిష్యుడిగా భావిస్తారు. రేవంత్ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చిన సమయంలో కూడా రాజకీయ పరిస్థితుల కారణంగా తాను బయటకు వచ్చానని... పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణలో రేవంత్ అనుసరించిన ఫార్ములాను.. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూడా అనుసరించినట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ చుట్టూ విపరీతంగా ప్రచార పర్వాన్ని నడిపించింది. ధరణి పోర్టల్ తో జరుగుతున్న అక్రమాలు, ఇబ్బందులను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంతో పాటు వాస్తవంగా గ్రామాల్లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ప్రజలు.. ధరణిపై విముఖత వ్యక్తం చేయడానికి ఓ కారణమైంది. ఇప్పుడు అదే పద్దతిలో టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ యుద్ధం ప్రకటించింది. తాను అధికారంలోకి రాగానే చేయబోయే రెండో సంతకం.. టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే అని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు కూడా.

కొన్ని రోజులుగా చంద్రబాబునాయుడు ఏపీలోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధివిధానాలు, దానివల్ల వచ్చే పర్యవసానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. పథకం అమలైతే వచ్చే ప్రమాదాలను.. తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా దీనిలో ఉన్న సమస్యలు, వాటిని పరిష్కరించడంలో ఎదురయ్యే ఇబ్బందులను .. ప్రస్తావిస్తున్నారు. ఇది నిజంగానే ప్రజల్ని భయానికి గురి చేస్తోంది. దీంతో ఈ చట్టం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ భయమొద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజలకు పటిష్టమైన భూహక్కులు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్నే ఏపీలో జగన్ సర్కారు అమలు చేస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనివల్ల భూములకు భరోసా వస్తుందంటున్నారు. అయితే ఇందులోనే ఓ ఇబ్బంది కనిపిస్తోంది. ఏమిటంటే.. ఇది కేంద్రం తెచ్చిన పథకమే అనుకుందాం.. అయితే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు దీన్ని అమలు చేయకుండా ఉండొచ్చు కదా... లేదంటే కాస్త సమయం తీసుకుని నిపుణులతో చర్చించి, వారితోనే ఈ చట్టం అమలు వల్ల వచ్చే లాభాలు జనానికి వివరించే ప్రయత్నం చేయొచ్చు. అలాంటివి కాకుండా.. నేరుగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ.. ఇప్పుడు భయమొద్దంటే ఎలా..? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :