ASBL NSL Infratech

మరోసారి విశ్వసనీయతనే నమ్ముకున్న జగన్

మరోసారి విశ్వసనీయతనే నమ్ముకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతోంది. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. ఈ ఎన్నికలు ఆయన పాలనకు రెఫరెండం లాంటివి. తన పాలన నచ్చితే ప్రజలు మళ్లీ అధికారం కట్టబెడతారు. లేకుంటే ఓడిస్తారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి ఘన విజయం సాధించిన వైసీపీ.. ఈసారి 175కు 175 సీట్లూ గెలుస్తామనే ధీమాతో ఉంది. ఈ ఐదేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను మళ్లీ గద్దెనెక్కిస్తాయనే నమ్మకంతో ఉంది. అందుకే మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాల జోలికి పోకుండా సాహసం చేసింది.

2019 ఎన్నికల సమయంలో వైసీపీ నవరత్నాలు పేరిట మేనిఫెస్టో ప్రకటించింది. అధికారంలోకి వస్తే వాటిని తాము తప్పకుండా అమలు చేస్తామని మాటించ్చింది. ఇప్పుడు ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ బయటపెట్టారు జగన్. 99శాతానికి పైగా హామీలను తాము అమలు చేసినట్లు జగన్ వెల్లడించారు. ఈ స్థాయిలో మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ మరొకటి లేదని జగన్ వెల్లడించారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా తాము అమలు చేసి చూపించామన్నారు.

అయితే జగన్ 99శాతం మేనిఫెస్టోను అమలు చేశామనడంపై విపక్షాలు విమర్శలు వర్షం కురిపిస్తున్నాయి. 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, స్టీల్ ప్లాంట్, విశాఖకు రైల్వే జోన్, రాజధాని అమరావతి లాంటివి అమలు చేయలని.. అలాంటప్పుడు 99 శాతం హామీలు అమలు చేసినట్లు ఎలా చెప్తారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రధానమైన హామీలను తుంగలో తొక్కిన జగన్.. బటన్ నొక్కి ఏదో చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అప్పులు చేసి తన జేబులో నుంచి ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆ విషయాలను పక్కన పెడితే 2024 మేనిఫెస్టోలో జగన్ ప్రజాకర్షక పథకాల జోలికి అస్సలు పోలేదు. 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలకు కొనసాగింపుగానే ఈ మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు. ఆ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని పింఛను మాత్రం చివరి రెండేళ్లలో 500 పెంచుతామని వెల్లడించారు. వైసీపీ మేనిఫెస్టో చూసి చాలా మంది పెదవి విరిచారు. ఒకవైపు కూటమి 6 గ్యారంటీల పేరుతో ఇప్పటికే కొన్నింటిని ప్రకటించింది. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటప్పుడు వైసీపీ ఒక్క ప్రజాకర్షక పథకాన్ని ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే కూటమి నేతలకు ఎప్పుడూ మేనిఫెస్టోను అమలు చేసిన చరిత్ర లేదని.. కానీ తాము అలా కాదని వైసీపీ చెప్తోంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని వివరిస్తోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :