ASBL NSL Infratech

ఏపీ ఎన్నికల్లో హాట్ సీట్స్

ఏపీ ఎన్నికల్లో హాట్ సీట్స్

*       టెన్షన్ పుట్టిస్తున్న అసెంబ్లీ స్థానాలివే..!
*       వైసీపీ, కూటమి పార్టీలకు ప్రతిష్టాత్మకం
*       ప్రత్యర్థిని ఓడించేందుకు స్పెషల్ ఫోకస్

 దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందరి చూపూ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా.. లేకుంటే కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందా.. అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇరుపక్షాలూ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నాయి. ఈ ఐదేళ్లలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్తోంది వైసీపీ. మీకు మేలు జరిగింటేనే తనకు ఓటేయాలని కోరుతున్నారు సీఎం జగన్. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ ఐదేళ్ల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం లాంటివి. మరోవైపు జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని.. అభివృద్ధి జరగాలంటే తామే అధికారంలోకి రావాలని కూటమి నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఎవరు గెలుస్తారు.. లాంటి అంశాలపై ఇప్పటికే జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి.

పులివెందుల

పులివెందుల వైఎస్ ఫ్యామిలీ అడ్డా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పులివెందుల నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. ఈసారి కూడా నెగ్గి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ తరపున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) బరిలో ఉన్నారు. ఇది వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. 1978 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబసభ్యులే విజయం సాధిస్తూ వస్తున్నారు. జగన్ గెలుపు ఖాయమని భావిస్తున్న ఈ నియోజకవర్గంలో అందరి చూపూ మెజారిటీ ఎంత అనేదానిపైనే ఉంది. గత ఎన్నికల్లో 90వేలకు పైగా మెజారిటీ సాధించారు జగన్. అయితే ఈసారి వైఎస్ షర్మిల కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. పులివెందులలో ఆమె ఓట్లు భారీగా చీలుస్తారనే ప్రచారం జరుగుతోంది.

కుప్పం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి కలిగిస్తున్న మరో నియోజకవర్గం కుప్పం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోట. 1989 నుంచి ఇప్పటివరకూ ఆయనే ఇక్కడ గెలుపొందుతూ వస్తున్నారు. ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రచారానికి వెళ్లకపోయినా ఆయనకు కుప్పం వాసులు అండగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు 30వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి కుప్పంలో ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పనిచేస్తోంది వైసీపీ. ఇక్కడ వైసీపీ తరపున ఎమ్మెల్సీ కె.ఆర్.జె.భరత్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనే స్వయంగా అన్ని వ్యవహారాలూ పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం అత్యంత ఆసక్తి రేపుతోంది.

పిఠాపురం

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఈసారి కూడా పవన్ కల్యాణ్ ను ఓడించాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. వైసీపీ తరపున ఈసారి వంగా గీత ఇక్కడ పోటీలో ఉన్నారు. ప్రజారాజ్యం తరపున వంగా గీత గతంలో పిఠాపురం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన పెండెం దొరబాబుకు ఈసారి టికెట్ నిరాకరించారు జగన్. కాపులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇద్దరూ కాపులే పోటీ పడుతుండడం ఆసక్తి కలిగిస్తోంది.

మంగళగిరి

మంగళగిరి అసెంబ్లీ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటి చేశారు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్. అయితే ఆ ఎన్నికల్లో ఆయన 5వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి లోకేశ్ పై గెలుపొందారు. ఇది అప్పట్లో సంచలనం కలిగించింది. పోయినచోటే వెతుక్కోవాలనే పట్టుదలతో ఈసారి కూడా లోకేశ్ బరిలో నిలిచారు. అయితే లోకేశ్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఈసారి వైసీపీ టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. రాజధాని అమరావతి అంశం ఇక్కడ ప్రధాన అస్త్రంగా మారనుంది. దీంతో ఈసారి ఎన్నికల్లో లోకేశ్ గెలుస్తారా.. లేదా అనే టెన్షన్ నెలకొంది.

కోవూరు

రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లాలోని కోవూరు ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి బరిలో ఉన్నారు. ఈమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్లు దక్కించుకున్నారు. వైసీపీ తరపున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. కోవూరు నల్లపురెడ్డి కంచుకోట అని చెప్పొచ్చు. 2004, 2014లో మినహా 1983 నుంచి ఇక్కడ నల్లపురెడ్డి కుటుంబీకులే గెలుస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా బంధువులు కావడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది.

నెల్లూరు సిటీ

నెల్లూరు జిల్లాలో ఆసక్తి కలిగిస్తున్న మరో నియోజకవర్గం నెల్లూరు సిటీ. ఇక్కడ టీడీపీ తరపున పొంగూరు నారాయణ మరోసారి బరిలో నిలిచారు. 2019లో ఈయన ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ తరపున పోటీ చేసిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ గెలిచి మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట పార్లమెంటు బరిలో నిలిపించి వైసీపీ అధిష్టానం. వైసీపీ తరపున ప్రస్తుతం ఎండీ ఖలీల్ అహ్మద్ పోటీలో ఉన్నారు. వైసీపీ ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నారాయణను ఈసారి కూడా ఓడించాలనే పట్టుదలతో ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో ఈసారి రాజకీయ సమీకరణాలు భారీగా మారాయి. దీంతో ఈసారి గెలుపు తమదేనని టీడీపీ గట్టిగా నమ్ముతోంది.

నెల్లూరు రూరల్

నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా తొలి నుంచి ఆసక్తి రేపుతున్న మరో నియోజకవర్గం నెల్లూరు రూరల్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ 2 సార్లు గెలుపొందారు. అయితే కొంతకాలం కిందట ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇప్పుడాయన టీడీపీ తరపున బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కోటంరెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఆదాలను ఇక్కడ బరిలోకి దింపింది వైసీపీ. అయితే కోటంరెడ్డిని జగన్ మోసం చేశారనే భావనలో ఉన్నారు ఆయన సన్నిహితులు. ఈ రెండు అంశాల మధ్య ఇక్కడ ఎన్నిక జరగబోతోంది.

నగరి

చిత్తూరు లోక్ సభ పరిధిలోని నగిరి అసెంబ్లీ ఈసారి వార్తల్లో నిలుస్తోంది. మంత్రి ఆర్కే రోజా ఇక్కడ వైసీపీ నుంచి మరోసారి బరిలో ఉన్నారు. 2014, 2019లో నెగ్గిన రోజా జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారామె. ఆమెపై టీడీపీ తరపున దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భానప్రకాశ్ బరిలో ఉన్నారు. రోజాను వ్యతిరేకిస్తున్న పలువురు వైసీపీ నేతలు ఇటీవల టీడీపీ గూటికి చేరారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది.

గుంటూరు పశ్చిమ

గుంటూరు పార్లమెంటు పరిధిలోని గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మంత్రి విడదల రజని బరిలో ఉన్నారు. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచిన విడదల రజనికి ఈసారి అక్కడ సీటు నిరాకరించి గుంటూరు వెస్ట్ సీటు కేటాయించారు. టీడీపీ తరపున గళ్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఈమె రాజకీయాలకు కొత్త. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. 2019లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీ గూటికి చేరిపోయారు. ఇప్పుడాయనకు సీటు ఇవ్వలేదు వైసీపీ. దీంతో ఈ స్థానంపై ఆసక్తి నెలకొంది.

గన్నవరం

విజయవాడ పార్లమెంటు పరిధిలోని గన్నవరం నియోజకవర్గం చాలాకాలంగా వార్తల్లో ఉంటోంది. 2019లో ఇక్కడ టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీమోహన్ కొంతకాలానికే వైసీపీ గూటికి చేరారు. ఇప్పుడాయన వైసీపీ తరపున బరిలో ఉన్నారు. వరుసగా రెండు సార్లు టీడీపీ గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. అయితే వంశీ నమ్మకద్రోహం చేశారని భావిస్తున్న టీడీపీ ఈసారి ఎలాగైనా ఆయన్ను ఓడించాలనుకుంటోంది. వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇక్కడ టీడీపీ టికెట్ ఇచ్చింది. వీళ్లిద్దరి మధ్య వార్ ఆసక్తికరంగా మారింది.

గుడివాడ

మచిలీపట్నం లోక్ సభ పరిధిలోని గుడివాడ ఆసక్తికర రాజకీయాలకు పెట్టిందిపేరు. 2004 నుంచి ఇక్కడ కొడాలి నాని విజయం సాధిస్తూ వస్తున్నారు. రెండుసార్లు టీడీపీ తరపున గెలవగా రెండు సార్లు వైసీపీ తరపున విజయం సాధించారు. ఈసారి కూడా ఆయన వైసీపీ తరపున బరిలో ఉన్నారు. చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్ గా కొడాలి నాని చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈసారి కొడాలి నానిని ఓడించాలనే కసితో ఉంది టీడీపీ. ఆ పార్టీ తరపున ఎన్నారై వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు.

భీమిలి

విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. ఇక్కడ వైసీపీ తరపున ముత్తంశెట్టి శ్రీనివాస రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన అవంతి శ్రీనివాస్ 2014లో టీడీపీ తరపున విశాఖ ఎంపీగా గెలిచారు. 2019లో వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన మరోసారి వైసీపీ నుంచి బరిలో నిలిచారు. అయితే అవంతి శ్రీనివాస్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు భీమిలి నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా గంటాకు పేరుంది. అందుకే ఈ నియోజకవర్గం అత్యంత ఆసక్తికరంగా మారింది.

చీపురుపల్లి

విజయనగరం పార్లమెంటు పరిధిలోని చీపురుపల్లి అసెంబ్లీ ఈసారి ఆసక్తికరంగా మారింది. సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇక్కడ మరోసారి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. 2014లో ఓడిపోయిన బొత్స సత్యనారాయణ 2019లో గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక టీడీపీ తరపున సీనియర నేత కిమిడి కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఇద్దరూ సీనియర్ నేతలు కావడం.. ఉత్తరాంధ్రపై పట్టున్న నేతలు కావడంతో ఇక్కడ ఈసారి పోరు ఉత్కంఠ రేపుతోంది.

ఉండి

ఉండి నియోజకవర్గం రాజుల కంచుకోటగా చెప్పొచ్చు. ఇక్కడ పార్టీలేవైనా రాజులే బరిలో ఉంటారు. 2019లో ఇక్కడ టీడీపీ తరపున మంతెన రామరాజు పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారు చంద్రబాబు. ప్రస్తుతం వైసీపీ తరపున 2019లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచి రెబెల్ గా మారిన రఘురామ కృష్ణంరాజు టీడీపీ తరపున బరిలో నిలిచారు. ఈ ఐదేళ్లూ వైసీపీని టార్గెట్ చేస్తూ రఘురామ కృష్ణంరాజు వార్తల్లో నిలిచారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఈయన పనిచేస్తున్నారు. వైసీపీ తరపున పీవీఎల్ నరసింహ రాజు మరోసారి పోటీ చేస్తున్నారు.

దెందులూరు

ఏలూరు లోక్ సభ పరిధిలోని నియోజకవర్గాల్లో దెందులూరు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ 2019లో వైసీపీ తరపున కొఠారు అబ్బయ్య చౌదరి గెలుపొందారు. అంతకుముందు 2009, 2014లో టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ విజయం సాధించారు. ఈసారి కూడా పోరు వీళ్లిద్దరి మధ్యే జరగుతోంది. చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేసుకుని వైసీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది.

విజయవాడ పశ్చిమ

విజయవాడ పార్లమెంటు పరిధిలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గం విజయవాడ వెస్ట్. ఇక్కడ బీజేపీ తరపున సుజనా చౌదరి బరిలో నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో సుజనా చౌదరి పోటీ చేయడం ఇదే తొలిసారి. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బరిలో నిలవడంతో ఆసక్తి రేపుతోంది. 2019లో ఇక్కడ వైసీపీ తరపున వెలంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే ఈసారి ఆయన్ను సెంట్రల్ కు బదిలీ చేసి ఇక్కడి నుంచి షేక్ ఆసిఫ్ కు టికెట్ ఇచ్చారు జగన్. అందుకే అందరి కళ్లూ ఈ నియోజకవర్గంపై పడ్డాయి.

మైలవరం

రాజకీయాలకు మైలవరం ఎప్పుడూ కేంద్రంగానే ఉంటోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావును ఓడించడమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. ఎట్టకేలకు విజయం సాధించారు. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీ తరపున బరిలో నిలిచారు. రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన దేవినేని ఉమామహేశ్వర రావుకు చంద్రబాబు టికెట్ నిరాకరించారు. బద్ధశత్రువులిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడం ఆసక్తి రేపుతోంది. వసంత కృష్ణ ప్రసాదుకు మద్దతిచ్చేందుకు దేవినేని అంగీకరించడంతో టీడీపీ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు వైసీపీ తరపున ఈసారి ఎస్.తిరుపతి రావు పోటీలో ఉన్నారు. ఇతడిని సామాన్యుడిగా చెప్తోంది వైసీపీ.

సత్తెనపల్లి

ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ముందుండే అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి మరోసారి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆయన మంత్రి పదవి కూడా చేపట్టారు. ఈసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. టీడీపీ తరపున సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ పోటీ చేస్తున్నారు. అంబటిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల ఈసారి టీడీపీలో కనిపిస్తోంది. అందుకే కన్నాను బరిలోకి దింపింది.

డోన్

కర్నూలు జిల్లాలో ఇప్పుడు అందరి చూపూ డోన్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడ వైసీపీ తరపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. డోన్ అభివృద్ధిలో బుగ్గన తనదైన ముద్ర వేశారు. ఇక టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. జిల్లాలో కోట్ల కుటుంబానికి మంచి పట్టుంది. అయితే డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుకు పత్తికొండ టికెట్ కేటాయించింది టీడీపీ. తమ్ముడు కేఈ ప్రభాకర్ డోన్ సీటు ఆశించి భంగపడ్డారు. దశాబ్దాల వైరం కలిగిన కోట్ల, కేఈ కుటుంబాలు ఇప్పుడు టీడీపీలో పనిచేస్తుండడం విశేషం.

హిందూపురం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఓడిపోని నియోజకవర్గం హిందూపురం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇక్కడి నుంచి మూడు సార్లు విజయం సాధించారు. ఇప్పడు ఆయన కుమారుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ టీడీపీ తరపున బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు నెగ్గిన ఆయన మూడోసారి గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. బాలకృష్ణను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైసీపీ తరపున తిప్పేగౌడ నారాయణ్ దీపిక బరిలో నిలిచారు. ఈమె బళ్లారికి చెందిన వ్యాపారవేత్త. టీడీపీ కంచుకోటను ఎలాగైనా బద్దలు కొట్టాలనేది ఈసారి వైసీపీ టార్గెట్.

ధర్మవరం

గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి చేసిన కార్యక్రమం పాపులర్ అయింది. వైసీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచిన ఆయన ఈసారి కూడా బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్, బీజేపీ తరపున వరదాపురం సూరి టికెట్లు ఆశించారు. అయితే వాళ్లిద్దరినీ కాదని బీజేపీ తరపున టికెట్ దక్కించుకున్నారు వై. సత్యకుమార్. ఈయనకు పరిటాల శ్రీరామ్ పూర్తిస్థాయిలో సహకరిస్తుండగా వరదాపురం సూరి మాత్రం అలక వీడలేదు. దీంతో ఈ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :