ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మొక్కలు త్వరగా ఎండిపోవడం సాధారణ సమస్యగా మారుతుంది. ఇంటి తోటలోని మొక్కలు వాడిపోకుండా కాపాడుకోవాలంటే కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
సరైన నీటి నిర్వహణతో పాటు కొద్దిపాటి శ్రద్ధ ఉంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. సమ్మర్ లో మొక్కలకు అవసరమైన నీటితో పాటు పోషకాలను అందించడం ముఖ్యం.
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్కలకు నీరు పోయడం మంచిది. మధ్యాహ్నం వేళల్లో నీరు పోస్తే వేడి కారణంగా త్వరగా ఆవిరైపోతుంది, మొక్కలకు తగిన తేమ అందదు.
మట్టిలో తేమ నిల్వ ఉండేలా మల్చింగ్ చేయడం చాలా ఉపయోగకరం. ఎండిన ఆకులు, గడ్డి లేదా కొబ్బరి పొట్టు వంటివి వాడితే నేల త్వరగా ఎండిపోకుండా ఉంటుంది.
క్రోటన్ రకాల మొక్కలకు నీరు ఎక్కువగా అవసరం ఉండదు.తరచుగా తక్కువ మోతాదులో నీరు ఇవ్వడం మంచిది. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లే ప్రమాదం ఉంటుంది.
పూల మొక్కలు ,కూరగాయ మొక్కలకు ఎండలో నేరుగా కాకుండా కొద్దిగా నీడ వచ్చేలా ఏర్పాటు చేయడం వల్ల బాగా ఎదుగుతాయి. షేడ్ నెట్ ఉపయోగించడం కూడా మంచి పరిష్కారం.
ఎరువుల విషయంలో సహజ ఎరువులు ఉపయోగించడం మంచిది. వేప ఆకుల నీరు లేదా కంపోస్ట్ ఎరువులు మొక్కలకు బలాన్ని ఇస్తాయి.
మొక్కల చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించడం కూడా అవసరం. అవి పోషకాలను పీల్చుకుంటాయి కాబట్టి ప్రధాన మొక్కలు బలహీనపడతాయి.
ఎండాకాలంలో ఆకులను తరచూ పరిశీలించడం వల్ల పురుగులు, వ్యాధులు త్వరగా గుర్తించవచ్చు. ముందుగానే చర్యలు తీసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
సరైన నీరు, నీడ, పోషకాలు అందిస్తే ఎండాకాలంలో కూడా మీ తోట పచ్చగా, అందంగా ఉంచుకోవచ్చు.