ఉదయం వేళ భ్రమరీ ప్రాణాయామం చేయడం మనసుకు, శరీరానికి చాలా మంచిది. ఈ ప్రాణాయామంలో తేనెటీగ మోగినట్లుగా వచ్చే శబ్దం కారణంగా దీనికి భ్రమరీ అనే పేరు వచ్చింది.
భ్రమరీ ప్రాణాయామం చేయడం వల్ల మనసు శాంతిస్తుంది. టెన్షన్, ఆందోళన, కోపం క్రమంగా తగ్గుతాయి. మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
ఈ ప్రాణాయామాన్ని ఉదయం ఖాళీ కడుపుతో చేయడం మంచిది. నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోవాలి. పద్మాసనం లేదా సుఖాసనం వేసుకుని వెన్నెముక నిటారుగా ఉంచాలి.
ముందుగా లోతుగా శ్వాస తీసుకోవాలి. తరువాత నోటిని మూసి, ముక్కు ద్వారా శ్వాస విడిచేటప్పుడు “మ్మ్” అనే మృదువైన శబ్దం రావాలి. చెవులను బొటనవేళ్లతో తేలికగా మూసుకోవచ్చు.
ఈ ప్రక్రియను రోజుకు 5 నుంచి 7 సార్లు చేయాలి. శ్వాసపై పూర్తిగా దృష్టి పెట్టాలి. తొందరపడకుండా నెమ్మదిగా చేయాలి.
నిత్యం భ్రమరీ ప్రాణాయామం చేస్తే నిద్ర బాగా పడుతుంది. తలనొప్పి తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరగడం తో పాటు మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా ఉత్సాహంగా గడపవచ్చు.