సహజ పోషకాల భాండాగారం జొన్నలు (Sorghum) మన ఆహారంలో చేర్చుకోవాల్సిన అత్యంత ఆరోగ్యకరమైన ధాన్యాల్లో ఒకటి. వీటిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు బి1, బి3, ఫోలేట్‌లతో శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

జీర్ణక్రియను మెరుగుపరచే ఆహారం జొన్నల్లో ఉండే అధిక ఫైబర్ వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. గ్లూటెన్ ఫ్రీగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ఉబ్బరం, అజీర్ణం వంటి ఇబ్బందులు తగ్గుతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

బరువు తగ్గించడంలో సహాయకం జొన్నల్లో ఉండే ఫైబర్ ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది కాబట్టి అధిక కేలరీలు తీసుకోకుండా బరువు తగ్గడానికి వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

మధుమేహ నియంత్రణ జొన్నల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహ రోగులు వీటిని తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు జొన్నల్లో ఫినాల్స్, టానిన్స్ వంటి ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల అవకాశాలు తగ్గుతాయి.

రుచిగా తినే మార్గాలు జొన్న పిండితో రొట్టెలు, అంబలి, కిచిడీ, పాన్‌కేక్స్ లేదా దోశలు తయారు చేయవచ్చు. కొద్దిగా అల్లం, జీలకర్ర, ఉప్పుతో కలిపి పిండిలా చేసి వేడిచేసిన పాన్‌పై వేయాలి. చట్నీతో కలిపి తింటే రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఇలా జొన్నలను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శక్తి, ఆరోగ్యం రెండింటినీ కాపాడుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అనడంలో డౌటే లేదు.