గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రోటీన్‌తో పాటు అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ ఆహారంలో చాలామంది వీటిని చేర్చుకుంటారు.
గుడ్లను మరింత రుచిగా రొటీన్ కి భిన్నంగా రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన మసాలా వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం.
గుడ్లను ముందుగా బాగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టాలి. వాటిపై చిన్న చిన్న గాట్లు వేస్తే మసాలా లోపలికి బాగా చేరి రుచి పెరుగుతుంది.
పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి బాగా వేయించాలి.
ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ జోడించాలి. దాని పచ్చివాసన పోయే వరకు బాగా కలిపి వేయించాలి.
ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరంమసాలా వేసి మసాలా బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం వంటకానికి ప్రధాన రుచి ఇస్తుంది.
ఉడికించిన గుడ్లను ఈ మసాలాలో వేసి బాగా కలపాలి. మసాలా గుడ్లకు పూర్తిగా పట్టేలా మెల్లగా తిప్పుతూ వేయించాలి.
చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే రుచికరమైన మసాలా గుడ్డు వేపుడు సిద్ధం. వేడి వేడిగా అన్నం, చపాతీ లేదా రోటితో తింటే అద్భుతంగా ఉంటుంది.