Floral Separator

ఇప్పటి కాలంలో ప్రేమ, డేటింగ్ చాలా సాధారణంగా మారాయి. కానీ అందులో నిజమైన ప్రేమ కంటే టైమ్ పాస్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది మొదట్లో ప్రేమగా నటించి తరువాత దూరమవుతున్నారు. మీరు కూడా అలాంటి రిలేషన్‌లో ఉన్నారా అనే అనుమానం వస్తే, కొన్ని సంకేతాలు మీకు స్పష్టత ఇస్తాయి.

పరిచయాలు చేయకపోవడం: మీ భాగస్వామి నిజంగా మీతో భవిష్యత్తు గురించి ఆలోచిస్తే,  వారు తప్పకుండా మిమల్ని తమ  కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు పరిచయం చేస్తారు. కానీ టైమ్ పాస్ చేసే వారు మాత్రం  మీ గురించి బయట చెప్పడానికి ఇష్టపడరు. సోషల్ మీడియాలో మీ ఫోటో కూడా పోస్ట్ చేయరు. మీ రిలేషన్ సీక్రెట్ గా ఉంచడానికి ట్రై చేస్తారు.

భవిష్యత్తు చర్చలకు దూరం: నిజమైన ప్రేమలో భాగస్వాములు కలిసి భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తారు. కానీ టైమ్ పాస్ రిలేషన్‌లో ఉన్నవారు భవిష్యత్తు గురించి మాట్లాడితే కోపం వస్తుంది లేదా నవ్వి లైట్‌గా తీసుకుంటారు. పెళ్లి, పిల్లలు వంటి విషయాలపై చర్చలు అవాయిడ్ చేస్తారు.

అకస్మాత్తుగా మాయం కావడం: అప్పుడప్పుడూ మీ మేసేజులకు  రిప్లై ఇవ్వకుండా, కాల్ ఎత్తకుండా ఉండటం (Ghosting) కూడా టైమ్ పాస్ లక్షణమే. మీరు ప్రశ్నిస్తే సాకులు చెబుతారు. ఈ ప్రవర్తన రిలేషన్‌లో ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది.

సెల్ఫ్ సెంట్రిక్: ఇలాంటి వారు రిలేషన్‌లో ఎప్పుడూ తమ ఇష్టానుసారం నడుస్తారు. మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వరు. మీతో కలవడం కూడా వారి సౌకర్యానికే పరిమితం అవుతుంది.

భావోద్వేగ దూరం: వారు మీతో శారీరకంగా దగ్గరగా ఉన్నా, భావోద్వేగంగా దూరంగా ఉంటారు. తమ భావాలను పంచుకోవడానికి ఇష్టపడరు. మీరు ఏదైనా లోతైన విషయం చెప్పినా, దాన్ని సరదాగా తీసుకుంటారు.

మీ భాగస్వామి నుంచి ఈ లక్షణాలు కనబడితే, అది టైమ్ పాస్ రిలేషన్‌ అని అర్థం చేసుకోవాలి. అలాంటి బంధం నుంచి బయటపడి, మీ గౌరవాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి.