తెలుగు ఇళ్లలో పప్పు అనేది ఓ ప్రత్యేకమైన వంటకం. వారంలో రెండు మూడు రోజులు పప్పు లేకుండా భోజనం పూర్తికాదు. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా పప్పులు ఎంతో ఉపయోగపడతాయి.

పప్పులు కేవలం ప్రోటీన్‌కే పరిమితం కావు. వీటిలో ఫైబర్, ఐరన్ , కాల్షియం, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ప్రతి పప్పులో ఒకే రకమైన పోషకాలు ఉండవు.

మినపప్పు ఇడ్లీ, దోశలకే కాదు పప్పు చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శక్తినిచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించి బరువు నియంత్రణకు ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో కూడా సహకరిస్తాయి.

ఎర్ర కందిపప్పు సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇది మంచిదిగా భావిస్తారు.

శనగపప్పు కండరాల బలానికి ఉపయోగపడుతుంది. పెసరపప్పు శరీరానికి చలువనిస్తుంది. ఇవి రెండూ ప్రోటీన్‌తో పాటు ఇతర ఖనిజాలను అందించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.