చలికాలం మొదలవగానే దోమల ఇబ్బంది పెరుగుతుంది. సాయంత్రం సమయంలో తలుపులు, కిటికీలు మూసినా చిన్న రంధ్రాల ద్వారా అవి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దోమ కాటుతో డెంగ్యూ (Dengue), మలేరియా (Malaria) వంటి వ్యాధులు రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం.
నాచురల్ ప్రొడక్ట్స్: మార్కెట్లో దొరికే దోమల స్ప్రేలు, కాయిల్స్లో రసాయనాలు ఉండటం వల్ల అవి ఆరోగ్యానికి హానికరమవుతాయి. అందుకే ఇంట్లో దొరికే సహజ వస్తువులతో దోమల్ని తరిమికొట్టడం ఉత్తమ మార్గం.
ఉల్లిపాయ దీపం: మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని పైభాగం కట్ చేసి లోపల రంధ్రం చేయాలి. అందులో ఆవాల నూనె రెండు టీ స్పూన్లు, కర్పూరం బిళ్లలు, మూడు లవంగాలు వేసి వత్తిని పెట్టి వెలిగించాలి. ఈ దీపం వాసన దోమలకు తట్టుకోలేనిది కాబట్టి అవి పారిపోతాయి.
నిమ్మకాయ – లవంగాల చిట్కా: నిమ్మకాయను సగానికి కట్ చేసి, ప్రతి భాగంలో లవంగం పెట్టి ఇంటి మూలల్లో ఉంచాలి. లవంగం వాసన దోమల్ని దూరంగా ఉంచుతుంది.
అల్లం – వెల్లుల్లి స్ప్రే: అల్లం, వెల్లుల్లి ముద్దలా రుబ్బి నీటితో కలిపి స్ప్రే బాటిల్లో పోసి పిచికారీ చేయాలి. ఈ సహజ మిశ్రమం దోమల్ని తరిమికొట్టడంలో బాగా సహాయపడుతుంది.
వేపాకు ధూపం: బొగ్గులను వేడి చేసి వాటిపై సాంబ్రాణి తో పాటు వేపాకు పొడిని వేయడం వల్ల ఇంట్లో దోమలు పారిపోతాయి. ఇది నాచురల్ హోమ్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది.
ఇలా కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా సహజమైన పద్ధతులు ఉపయోగించడం ఆరోగ్యకరమైనదే కాకుండా పర్యావరణానికీ మేలు చేస్తుంది.